నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కాదు.. సుప్రీంకోర్టు చెప్పినా సరే రాయలసీమ ఎత్తిపోతల కట్టి తీరుతామన్న విధానానికి సీఎం జగన్ స్టిక్ అయిపోయినట్లుగా తెలుస్తోంది. ఎవరేమన్నా సరే.. ఈ విషయంలో వెనక్కి తగ్గకూడదని భావిస్తున్నారు. ఇదే విషయాన్ని కాస్త పదునైన మాటల్లో తనే కేంద్రానికి కూడా సమాచారం పంపారు. తెలంగాణా ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులను సందర్శించి ఆ తర్వాత మాత్రమే రాయలసీమ ఎత్తిపోతల పధకం నిర్మాణం జరిగే ప్రదేశానికి రావాలని కేంద్ర జలశక్తి మంత్రికి రాసిన లేఖలో తేల్చి చెప్పారు. ఎన్జీటీ ఆదేశించిందనో.. మరో కారణంతోనే కేఆర్ఎంబీ బృందం వస్తుందంటే.. తాము రానివ్వబోమని.. స్పష్టం చేశారు.
ఓ వైపు ఆదేశాలను ధిక్కరించి.. సీమ ఎత్తిపోతల నిర్మాణం జరుగుతున్నట్లుగా తెలిస్తే.. సీఎస్‌ను జైలుకు పంపుతామని.. ఎన్జీటీ నేరుగానే హెచ్చరించింది. అయితే ఇప్పుడు ఆ ఎన్జీటీని అసలు లెక్కలోకి తీసుకోకుండా… ప్రాజెక్ట్ ప్రాంతాన్ని కూడా పరిశీలించాడనికి అంగీకిరంచబోమని సీఎం నేరుగా చెప్పడం… ఆసక్తి రేపుతోంది. సీఎం జగన్.. తాడోపేడో తేల్చుకోవాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. తమ భూభాగంలో.. తమ డబ్బులతో ప్రాజెక్టు కట్టుకుంటూంటే.. ఎన్జీటీ.. కేంద్ర పర్యావరణ శాఖ.. కేంద్ర జల మంత్రిత్వ శాఖ.. కృష్ణాబోర్డు అడ్డుకోవడానికి ఎవరన్న ఉద్దేశంలో ఆయన ఉన్నారు. అందుకే అక్కడ ఇప్పటికీ పనులు జరుగుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై తెలంగాణ సర్కార్ మరోసారి ధిక్కార పిటిషన్ వేసింది.
అయితే దేశంలో రాజ్యాంగ సంస్థలను ధిక్కరించడం.. ఏపీ సర్కార్‌కు కొత్తేమీ కాదు. గతంలో ఎన్నికల కమిషన్.. హైకోర్టులను కూడా ధిక్కరించారు. ఇప్పుడు ఆ జాబితాలో ఎన్జీటీ చేరుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తానికి జగన్ ఈ వివాదాలతో ఏం సాధిస్తారో కానీ.. ఈ రగడ మాత్రం అంతకంతకూ పెంచుకుంటూ పోయే పనిలో ఉన్నారని మాత్రం అర్థమవుతోందని నిపుణులు అంటున్నారు. తెలంగాణ సర్కార్ కూడా తాము చేసేది తాము చేస్తోంది. దీంతో ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వాళ్లు చేస్తే ఇక కేంద్రం.. కృష్ణాబోర్డులు ఎందుకన్న వాదన కూడా ఢిల్లీలో వినిపిస్తోంది.