వైఎస్ఆర్ జయంతో.. వర్థంతో వస్తే యదుగూరి సందింటి ఫ్యామిలీ మొత్తం ఇడుపులపాయలో ఉంటుంది. అందరూ ఆత్మీయంగా పలకరించుకుని… వైఎస్‌కు నివాళులు అర్పిస్తారు. అయితే గత రెండేళ్ల నుంచి ఈ పరిస్థితి మారిపోయింది. షర్మిల కుటుంబం కార్యక్రమాలకు దూరంగా ఉంటోంది. ఆ కారణంగానే వైఎస్ కుటుంబంలో.. ఆయన కుమారుడు, కుమార్తె మధ్య పలకరించుకోలేనంత విబేధాలు వచ్చాయన్న ప్రచారం ఊపందుకుంది. అయితే అంత తీవ్రమైన విబేధాలు ఉన్నాయన్న విషయాన్ని బహిరంగంగా ఎప్పుడూ అటు జగన్ కానీ ఇటు షర్మిల కానీ ప్రదర్శించుకోలేదు. కానీ మొదటి సారి… మొహాలు కూడా చూసుకోలేనంత గ్యాప్ ఇద్దరి మధ్య వచ్చిందని నిరూపించాల్సి వచ్చింది.
ఎనిమిదో తేదీన వైఎస్ఆర్ జయంతి. ఆ రోజున షర్మిల తెలంగాణలో పార్టీ ప్రారంభిస్తున్నారు. అందు కోసం బెంగళూరు నుండి ఇడుపుల పాయ వచ్చి మధ్యాహ్నం వరకూ ప్రార్థనలు చేసి.. తండ్రికి నివాళులు అర్పించి.. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్తారు. అదీ షెడ్యూల్. సీఎం జగన్ షెడ్యూల్ కూడా ఉదయం పూట… ఇడుపులపాయలో నివాళులు అర్పించేలా ప్రోగ్రాం రూపొందించారు. కానీ హఠాత్తుగా.. మధ్యాహ్నానికి మార్చేశారు. షర్మిల ఇడుపుల పాయ నుంచి వెళ్లిపోయిన తర్వాతనే.. జగన్ ఇడుపుల పాయకు వెళ్లేలా షెడ్యూల్ రూపొందించారు. అందు కోసం ముందుగా అనంతపురం జిల్లాలో ప్రోగ్రామ్స్ ఫిక్స్ చేశారు. దీంతో వైఎస్ఆర్ ఫ్యామిలీలో వివాదాలు… బహిరంగమైనట్లుగా చర్చ జరుగుతోంది.
షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం.. జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదని కొంత మంది చెబుతూంటారు. లేదు.. కేసీఆర్ వ్యూహంలో భాగంగా ఆయనే.. చెల్లిని పార్టీ పెట్టమని ప్రోత్సహించారని మరికొంత మంది విశ్లేషిస్తూంటారు. అయితే షర్మిల మాత్రం… తాను ఎవరూ వదిలిన బాణం కాదని చెబుతూంటారు. అయితే.. జగన్‌తో విబేధాలు వచ్చిన మాట మాత్రం నిజమని.. తాజా పరిణామాల ద్వారా తెలిసిపోతోందని అంటున్నారు. కుటుంబంలో వివాదాలు వస్తే.. అదీ రాజకీయ కుటుంబంలో విబేధాలు వస్తే… అవి సంచలనాలకు కారణమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ముందు ముందు జగన్ – షర్మిల విబేధాలు రాజకీయంగా ఎలాంటి కీలక మలుపులు తిరుగుతాయో అంచనా వేయడం కష్టమే.