ఈత కాయ ఆశ పెట్టి తాటికాయ కొట్టేయడం ఎలాగో.. ఏపీకి కేంద్రం మరోసారి చూపిస్తోంది. విశాఖ రైల్వే జోన్ ప్రకటించామంటూ… వాల్తేర్ డివిజన్‌ను ఒరిస్సాలని రాయగడ డివిజన్లో కలిపేసింది. విశాఖ రైల్వే జోన్ పనులు అసలు ప్రాథమికంగా కూడా ప్రారంభం కాలేదు కానీ వాల్తేర్‌ను లాగేసుకుని రాయగడలో కలుపుకునే పనులు మాత్రం పూర్తయ్యాయి. అతి త్వరలోనే ఈ పనులు పూర్తి చేయబోతున్నారు. వందల కోట్లు వెచ్చిస్తున్నారు. కానీ.. విశాఖ రైల్వే జోన్‌కు మాత్రం పైసా కేటాయించడం లేదు.
విశాఖతో పాటే రాయగడ డివిజన్ ప్రకటన..!
విశాఖను రైల్వే డివిజన్‌గా మూడేళ్ల కిందంట ప్రకటించిన కేంద్రం.. అత్యంత లాభదాయకమైన వాల్తేర్ డివిజన్‌ను మాత్రం రెండు ముక్కలు చేసింది. ఒక ముక్కను విజయవాడ డివిజన్లో కలిపారు. మరో ముక్కతో ఒడిసాలోని రాయగఢ కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అంటే… విశాఖ కేంద్రంగా జోన్ ఉంటుందికానీ, డివిజన్ ఉండదు. సరుకు రవాణాలో కీలకమైన కోరాపుట్, కిరండోల్ లైన్లను రాయగఢలోనే కలిపేశారు. శ్రీకాకుళం జిల్లాలో పలాస నుంచి ఇచ్ఛాపురం వరకూ ఉన్న రైల్వే స్టేషన్లు ఖుర్దా డివిజన్లో ఉన్నాయి. వీటిని కూడా.. విశాఖ రైల్వేజోన్‌లో చేర్చలేదు. రైల్వే జోన్ ఇంకా పేపర్ల మీదకు కూడా పూర్తి స్థాయిలో రాలేదు. కానీ రాయగడ డివిజన్ పనులు మాత్రం పూర్తయ్యాయి.
వందల కోట్లతో రాయగడ డివిజన్ పనులు..!
రాయగడ డివిజన్ ఏర్పాటుకు మౌలిక వసతులేమీ లేవు. అయినా అటు రైల్వేబోర్డు, ఇటు తూర్పుకోస్తా రైల్వేజోన్ రాయగడలో ఏర్పాట్ల మీద కోట్లకు కోట్లు ఖర్చు చేస్తోంది. ప్రస్తుతం రాయగడలో రూ.40కోట్ల విలువైన పనులు జరుగుతున్నట్లు రైల్వే వర్గాలు వెల్లడిస్తున్నాయి. డివిజన్ కేంద్ర కార్యాలయానికి భూకేటాయింపులు అయిపోయాయి. సర్వే పూర్తయింది. నిర్మాణాలు మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రైల్వేస్టేషన్లో ప్లాట్‌ఫారాల పెంపు, ఇతర భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. రాయగడలో ఏర్పాట్ల కోసం నోడల్ అధికారిని నియమించారు. డివిజన్లో రైల్వే ఆస్తుల రక్షణ బాధ్యతల్ని చూసే ఆర్పీఎఫ్ వ్యవస్థ ఏర్పాటు కోసం రాయగడలో నిర్మాణాలు జరుగుతున్నాయి. డివిజన్ స్థాయి అధికారుల కార్యాలయాలకు సన్నాహాలు చేస్తున్నారు.
అన్నీ సిద్ధంగా ఉన్నా జోన్ ఉసెత్తని కేంద్రం..!
మరో వైపు విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటుకు అన్ని రకాల సౌకర్యాలు విశాఖలో ఉన్నాయి. డీపీఆర్‌లో ఇప్పటికే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. రైల్వేజోన్‌ను ఏర్పాటుచేసేందుకు విశాఖలో భవనాలు సిద్ధంగా ఉన్నాయి. తీసుకోవాల్సింది అధికారిక నిర్ణయమేనని చెబుతున్నారు. రాయగడలో డివిజన్ పనులు పూర్తయిన తర్వాతనే విశాఖ రైల్వేజోన్ సంతి చూస్తారని ఉన్నత స్థాయి వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. అసలు ఆ డివిజన్ విశాఖ రైల్వే జోన్‌తో సంబంధం లేదు కానీ..అది పూర్తయితేనే… విశాఖ జోన్ సంగతి చూస్తామని లింక్ పెట్టి చెప్పడం ప్రజల్ని మోసం చేయడమేనన్న విమర్శలు వస్తున్నాయి.
రాయగడ డివిజన్ పూర్తయితేనే విశాఖ జోన్ అంటూ కొత్త కథలు..!
పిల్లి గుడ్డితైతే ఎలుక ఎక్కిరించిందన్నట్లుగా ఉంది … ఆంధ్రప్రదేశ్‌తో రైల్వేజోన్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి. రైల్వేకు నష్టమో.. కష్టమో… జోన్ అయితే ఇవ్వాలని నిర్ణయించారు. ఆ నిర్ణయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రం పై ఉంది. అడిగేవారు లేరని.. అందరూ భయంతో నోరు మూసుకున్నారని.. ఇక దాన్ని అమలు చేయాల్సిన అవసరం లేదుకుంటే అది ఖచ్చితంగా ప్రజల్ని అవమానించడమే అవుతుంది. ఇప్పుడు కొత్తగా మభ్య పెట్టేందుకు నాటకాలు కూడా ప్రారంభించారు.