అఖిల్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న చిత్రం `ఏజెంట్`. ఇందులో అఖిల్ సీక్రెట్ ఏజెంట్ గా నటిస్తున్నాడు. ఓ కీలక పాత్రలో మమ్ముట్టిని ఎంచుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. మమ్ముట్టి పేరు దాదాపు ఖాయమైపోయింది. అధికారిక ప్రకటన రావడమే తరువాయి. ఈ సినిమా కోసం ఆయనకు రూ.3 కోట్ల పారితోషికం ఇచ్చినట్టు సమాచారం.
ఇందులో మమ్ముట్టి పాత్ర ఏమిటన్నది అంతటా ఆసక్తి రేకెత్తిస్తోంది. అఖిల్ – మమ్ముట్టి తండ్రీ కొడుకులుగా నటిస్తున్నారని, మమ్ముట్టి విలన్ అని రకరకాల వార్తలొస్లున్నాయి. అయితే ఇవి రెండూ కాదు. వీరిద్దరూ గురు శిష్యులుగా కనిపించబోతున్నారు. మమ్ముట్టిది పక్కా పాజిటీవ్ పాత్ర. కాకపోతే.. వీరిద్దరి క్యారెక్టరైజేషన్స్ నువ్వా? నేనా? అన్నట్టు సాగబోతున్నాయట. ఈ పాత్ర కోసం చాలామంది ప్రముఖుల పేర్లు పరిశీలించారని, అయితే మార్కెట్ ని, ఫ్రెష్ కాంబినేషన్ చూపించాలన్న ఆలోచననీ దృష్టిలో ఉంచుకుని మమ్ముట్టిని ఎంచుకున్నారని తెలుస్తోంది.