కృష్ణా జలాల్లో సగం .. సగం వాటా ఉంటుందని కేసీఆర్ చేసిన ప్రకటన ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి చిక్కులు తెచ్చి పెడుతోంది. ఈ అంశంపై ఎలా మాట్లాడాలో తెలియక సతమతమవుతోంది. దీనికి కారణం కృష్ణా నికర జలాల్లో 299 టీఎంసీలు తెలంగాణకు..513 టీఎంసీలు ఏపీకి అని 2015లోనే రెండు ప్రభుత్వాలు ఒప్పందం చేసుకున్నాయి. దాని ప్రకారమే అప్పట్నుంచి కృష్ణా బోర్డు నీటి కేటాయింపులు చేస్తూ వస్తోంది. అయితే… తాజాగా ఏర్పడిన వివాదంతో కేసీఆర్ ఒప్పందం చెల్లదనే వాదనను తెరపైకి తీసుకు వచ్చారు. కృష్ణా జలాలు సగం సగం ఇవ్వాల్సిందేనని వాదిస్తున్నారు.
దీంతో వైసీపీ సర్కార్.. అది అసంబద్ధమైన వాదన అని .. చెప్పడానికి తంటాలు పడుతోంది. సొంత మీడియాలో బ్యానర్ ఆర్టికల్ ప్రచురించారు కానీ.. అది ఏపీలో మాత్రమే పరిమితం చేశారు. తెలంగాణ వారికి కనిపించనీయకుండా చేశారు. దీంతో.. ఊరకే ఏపీ సర్కార్ తమ వాదన రాజకీయంగా చెప్పడానికి తప్ప.. ఆ విషయాన్ని నేరుగా పై స్థాయిలో చెప్పేందుకు సాహసించడం లేదని తెలుస్తోంది. మరో వైపు చంద్రబాబు హయాంలో చేసుకున్న ఒప్పందం ఇప్పుడు కాదంటున్న కేసీఆర్పై ఒత్తిడి పెంచేందుకు రాజకీయ పార్టీలు.. ఆయుధంగా వాడుకుంటున్నాయి. 2015లో చంద్రబాబుతో 299 టీఎంసీలకు అంగీకరిస్తూ ఒప్పందం చేసుకున్నది నిజమో కాదో చెప్పాలని టీ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు.
అది నిజం కాకపోతే.. తాను శ్రీశైలంలో దూకి ఆత్మహత్య చేసుకుంటానన్నారు. ఏపీ బీజేపీ నేత టీజీ వెంకటేష్ కూడా అంతే స్పందించారు. చంద్రబాబు హయాంలో కృష్ణా జలాలపై చేసుకున్న ఒప్పందం ప్రకారం నీటి కేటాయింపులు జరగకుండా.. ఆ ఒప్పందం చెల్లదంటే.. అసలు విభజనే చెల్లదని తాము వాదిస్తామని అంటున్నారు. ఉన్న ఒప్పందాన్ని కూడా సమక్రంగా అమలు చేసుకోలేకపోతే.. ఏపీ సర్కార్ ఎందుకన్న ప్రశ్న.. రైతుల్లో వచ్చే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో వైసీపీకి టెన్షన్ ప్రారంభమయింది.