లేడికి లేచిందే పరుగు అన్నట్టు.. `మా` ఎన్నికల కోసం తొందరపడుతున్నాడు ప్రకాష్ రాజ్. `ఈసారి నేను ఎన్నికలకు రెడీ` అని ఆరు నెలల ముందే సమర శంఖం ఊదేసిన ప్రకాష్ రాజ్ – ప్రెస్ మీట్ పెట్టి మరీ హడావుడి చేశారు. ఏకంగా ప్యానల్ ని కూడా ప్రకటించేశారు. `ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనంత వరకూ నేను గానీ, నా ప్యానల్ గానీ నోరు మెదిపేది లేదు` అని చెప్పుకొచ్చారు. కట్ చేస్తే.. ఇప్పుడు మళ్లీ ఎన్నికల కోసం ఆత్రుత ప్రదర్శిస్తున్నారు. కాసేపటి క్రితం ట్విట్టర్ లో `ఎలక్షన్స్ ఎప్పుడు` అంటూ ఓ ప్రశ్న సంధించారు. దాన్ని బట్టి చూస్తే… ఎన్నికల నోటిఫికేషన్ ప్రకటించేంత వరకూ ప్రకాష్ రాజ్ ఆగేటట్టు కనిపించడం లేదని అర్థమైంది.
నిజానికి `మా` ఎన్నికలకు ఇంకా 3 నెలల సమయం ఉంది. ఈలోగా ఓ జనరల్ బాడీ మీటింగ్ కూడా జరగాలి. ఆ మీటింగ్ ఎప్పుడన్న విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ఆ మీటింగ్ అయితే గానీ… ఎలక్షన్స్ ఎప్పుడో తెలీదు. ఈసారి `మా` ఎన్నికల కోసం భారీ ఎత్తున పోటీ ఎదురవుతున్న సంగతి తెలిసిందే. అయితే సినీ పెద్దలు మాత్రం మా అధ్యక్షుడ్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని భావిస్తున్నారు. అందుకు ఓ పక్క.. ప్రయత్నాలూ ప్రారంభించారు. అయితే ప్రకాష్ రాజ్ మాత్రం ఈ ఎన్నికల ఊసు తీసి.. మళ్లీ కెలికినట్టైంది. ప్రకాష్ రాజ్ తీరు చూస్తుంటే.. ఎలక్షన్ డేట్ ప్రకటించే వరకూ.. ఆయన ఇలానే ట్విట్టర్ లో.. ప్రశ్నలు సంధిస్తూనే ఉంటారనిపిస్తోంది. ప్రకాష్ రాజ్ కి మద్దతుగా ఉన్న చిరు ఓ పక్క.. మా ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని ఆలోచిస్తుంటే.. ఆయన మద్దతు అందుకున్న ప్రకాష్ రాజ్ మాత్రం తన దూకుడుని తగ్గించకపోవడం ఆశ్చర్యపరుస్తోంది.