ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీస్ అధికారులు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ధిక్కరణ కేసుల్లో నోటీసులు అందుకుని కోర్టుల్లో హాజరు వేయించుకుని విధులకు వెళ్తున్నారు. ఒక్కో సారి శిక్షకు గురవుతున్నారు. తాజాగా.. చిరంజీవి చౌదరి, గిరిజా శంకర్ అనే సివిల్ సర్వీస్ అధికారులకు కోర్టు శిక్ష విధించింది. కోర్టు సమయం ముగిసే వరకూ కోర్టులోనే ఉండాలని ఆదేశించింది. ఇదేమీ పెద్ద శిక్ష కాదు కానీ… పరువుకు మాత్రం భంగమే. అలాగే… వారి సర్వీస్ రికార్డుల్లోనూ ఈ అంశం నమోదవుతుంది. భవిష్యత్‌లో వారి ప్రమోషన్లకు ఇబ్బందే. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా అమలు చేయకపోవడమే వీరిని హైకోర్టు శిక్షించడానికి కారణం.
వీరు శిక్షలో భాగంగా కోర్టులో ఉన్న సమయంలోనే… చీఫ్ సెక్రటరీ ఆదిత్యనాథ్ దాస్ కూడా హైకోర్టుకు వచ్చారు. ఈయన వచ్చింది .. వీరిని సానుభూతితో పరామర్శించడానికి కాదు. ఆయన కూడా కోర్టు ధిక్కరణ కేసులో హాజరవడానికి వచ్చారు. ఆ కేసులో అఫిడవిట్ సమర్పించేందుకు సమయం అడిగి… అనుమతించడంతో వెళ్లిపోయారు. ఇలాంటి కోర్టు ధిక్కరణ కేసులు సీఎస్ దగ్గర్నుంచి అనేక మంది సివిల్ సర్వీస్ అధికారులపై పడ్డాయి. ఐఏఎస్ ప్రవీణ్ కుమార్, ఐపీఎస్ సునీల్ కుమార్లపైఇప్పటికే హైకోర్టు కేసులు నమోదుకు ఆదేశాలు జారీ చేసింది. వారంతా కోర్టుల చుట్టూ తిరగడమే కాదు భవిష్యత్‌లో కూడా తీవ్ర ఇబ్బందులు పడనున్నారు.
వైసీపీ ప్రభుత్వంలో అనేక మంది సివిల్ సర్వీస్ అధికారులపై కోర్టు ధిక్కరణ పిటిషన్లు పడ్డాయి. ప్రభుత్వం చెప్పినట్లుగా చేస్తు్న్న ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు చట్టాలు.. రాజ్యాంగాన్ని కూడా పట్టించుకోవడం లేదు. ఫలితంగా కేసుల పాలవుతున్నారు. గతంలో పలువురు అధికారులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పరిణామాలతో అధికారవర్గాల్లో అలజడి రేగుతోంది. అయితే పోస్టింగ్‌ల కోసం కొంత మంది.. చట్టాలను ఉల్లంఘించి ప్రభుత్వానికి సేవ చేయడానికి వెనుకాడటం లేదు. ఈక్రమంలో వివాదాలు వస్తున్నా వెనక్కి తగ్గడం లేదు.
గతంలో వైఎస్ జగన్ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. పలువురు సివిల్ సర్వీస్ అధికారులు కేసుల పాలయ్యారు. కొంత మంది జైళ్లకు కూడా వెళ్లారు. ఇప్పుడు స్వయంగా సీఎంగా జగన్ అయినా… మరితం జాగ్రత్తగా ఉండాల్సిన అధికారులు… ఆయన చెప్పిందే రాజ్యాంగం.. చట్టంఅన్నట్లుగా వ్యవహరిస్తూండటంతో… మళ్లీ కోర్టుల పాలవుతున్నారు. ఈ ప్రభుత్వంలో వ్యవహారాలపై వచ్చే ప్రభుత్వం విచారణ జరిపితే.. కనీసం సగం మంది కీలక నిర్ణయాలు తీసుకున్న సివిల్ సర్వీస్ అధికారులు జైలుకెళ్లక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.