రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ప్రమాణస్వీకారం చేస్తున్నారు. కానీ కాంగ్రెస్ క్యాడర్ మాత్రం ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్నారంతగా హడావుడి చేస్తున్నారు. హైదరాబాద్ మొత్తాన్ని ఫ్లెక్సీలతో నింపేశారు. నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ ర్యాలీలు చేస్తున్నారు. ఇప్పటి వరకూ భవిష్యత్ ఉంటుందో ఉండదోననే డైలమాతో ఉన్న క్యాడర్లో ఇక భవిష్యత్ మనదే అన్న నమ్మకాన్ని రేవంత్ రెడ్డికి పీసీసీ పీఠం ఇవ్వడం ద్వారా.. హైకమాండ్ కల్పించగలిగింది. అందుకే నిద్రాణంగా ఉన్న క్యాడర్ ఒక్క సారిగా మేలుకుంది. కాంగ్రెస్‌లో ఇంత కదలికను.. ఇతర పార్టీలు ఊహించలేకపోయాయి. ఇతర పార్టీలే కాదు..సొంత నేతలు కూడా ఊహించలేకపోయారు. అందుకే.. రేవంత్ కు అనుకూలంగా అందరూ మారిపోయారు.
సీనియర్ నేతల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ క్యాడర్ మొత్తం రేవంత్ రెడ్డి వైపు ఉందని.. తాజా పరిణామాలతో తేలిపోయింది. క్యాడర్ ఉత్సాహం చూసిన సీనియర్లు కూడా మెత్తబడిపోయారు. ఒక్క కోమటిరెడ్డి మాత్రమే వ్యతిరేక ప్రకటన ఒక్క సారి చేశారు. తర్వాత ఆయన కూడా సైలెంటయిపోయారు. శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క లతో పాటు రేవంత్‌ను గట్టిగా వ్యతిరేకించిన వీహెచ్, జగ్గారెడ్డి లాంటి వాళ్లు ఇప్పుడు.. రేవంత్ నాయకత్వంలో పోరాటం చేస్తామని ప్రకటించారు. ఇక పీసీసీ చీఫ్‌గా ఇంత కాలం ఉన్న ఉత్తమ్ కూడా.. రేవంత్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పుడు వారంతా.. తప్పనిసరిగా రేవంత్ నాయకత్వంలో నడవక తప్పని పరిస్థితి ఏర్పడింది.
రాజకీయాలు.. లీడర్ సెంట్రిక్‌గా నడుస్తాయి. కేసీఆర్‌కు ఢీకొట్టే నాయకుడు లేకపోవడం వల్లే ఇప్పటి వరకూ ఆయనకు ప్రత్యామ్నయాం లేకపోయింది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి రంగంలోకి వచ్చారు. మాటల్లో కానీ.. చేతల్లో కానీ… కేసీఆర్‌కు ధీటైన నాయకుడు రేవంత్ రెడ్డి అన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ఈ కారణంగా వచ్చే ఎన్నికలు రేవంత్ రెడ్డి వర్సెస్ కేసీఆర్ అన్నట్లుగా సాగితే… ఇతరులకు మధ్యలో చోటు ఉండదు. పదేళ్ల పాటు అధికారంలో ఉండటం… కేసీఆర్ హామీలన్నీ ప్రకటనలకే పరిమితమవుతాయన్న అభిప్రాయం పెరుగుతున్న నేపధ్యంలో రేవంత్ రెడ్డికి గొప్ప అవకాశం ఎదురొచ్చినట్లయింది.
రేవంత్ రెడ్డికి సరైన సమయంలో పార్టీ బాధ్యతలు లభించింది. సీనియర్లు కూడా ఇక తిరుగుబాటు చేయలేని పరిస్థితి ఉంది. ఓ విధంగా చెప్పాలంటే గతంలో ఎన్నడూ లేనంత ఏకతాటిపైకి తెలంగాణ కాంగ్రెస్ వచ్చింది. ఇక బాధ్యతంతా రేవంత్ రెడ్డి పైనే ఉంది. అందర్నీ ప్రణాళికాబద్ధంగా ఉపయోగించకుని కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిన లక్ష్యం ఆయన ముందు ఉంది. అది సాధిస్తేనే.. ఆయన కల నెరవేరుతుంది.