`గబ్బర్ సింగ్`తో తన తడాఖా చూపించాడు హరీష్ శంకర్. పవన్ కల్యాణ్ ని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించేశాడు. ఆ తరవాత.. పవన్ నుంచి అంత మాస్, కమర్షియల్ ఎంటర్ టైనర్ మరోటి రాలేదు. ఇప్పుడు మరోసారి పవన్ – హరీష్ జట్టు కట్టబోతున్నారు. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. `ఈసారి ఎంటర్‌టైనర్ మాత్రమే కాదు` అంటూ.. కాన్సెప్ట్ పోస్టర్ లోనే చెప్పేశాడు హరీష్ శంకర్. అంటే.. వినోదంతో పాటు, సందేశాన్ని కూడా మిక్స్ చేస్తున్నట్టు చెప్పకనే చెప్పినట్టు. ఆ సందేశం ఏమిటి అనే సందేహం అందరిలోనూ ఉంది. పవన్ రాజకీయాలలో బిజీగా ఉన్నాడు కాబట్టి.. ఈ కథలో పొలిటికల్ డ్రామా మిక్స్ చేసే అవకాశం ఉందన్న ఊహాగానాలు ఎక్కువయ్యాయి.
నిజానికి ఈ సినిమాలో పాలిటిక్స్ ఏమాత్రం కనిపించవు. హరీష్ అనుకుంటున్న కాన్సెప్ట్ వేరే. ఈసారి విద్యావ్యవస్థపై.. ఓ సెటైర్ వేయబోతున్నాడట. అది కూడా రాజకీయాలకు అతీతంగా. పవన్ పాత్రలో రెండు కోణాలుంటాయని, ఓ కోణంలో పవన్ పాత్ర చాలా జోవియల్‌గా ఉంటుందని, మరో కోణంలో పవన్ పాత్ర ప్రశ్నించడం మొదలెడుతుందని.. అదంతా విద్యావ్యవస్థని టార్గెట్ చేసే కోణంలో సాగుతుందని సమాచారం. అంతే కాదు.. కొన్ని సన్నివేశాల్లో తెలుగు భాష గొప్పదనం, సంస్కృతి విశిష్టత చెప్పబోతున్నారని తెలుస్తోంది. మొత్తానికి… హరీష్ శంకర్ బలమైన కాన్సెప్టే పట్టుకున్నాడు. పవన్ లాంటి హీరోలు చెబితే.. అది మరింత బలంగా, సూటిగా జనంలోకి వెళ్తుంది. ఇప్పటికే.. హరీష్ కథని పూర్తి స్థాయిలో సిద్ధం చేయడం, పవన్ కి వినిపించడం జరిగిపోయాయి. పవన్ ఎప్పుడంటే అప్పుడు సినిమాని పట్టాలెక్కించేయడమే.