రేపట్నుంచి (జులై 8) థియేటర్ల తాళాలు తెరవబోతున్నారు. ఏపీలో థియేటర్లు తెరచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల బాక్సాఫీసుల దగ్గర మళ్లీ సందడి మొదలవ్వబోతోంది. రేపట్నుంచి కాకపోయినా, వచ్చే వారం నుంచైనా కొత్త సినిమాల సందడి చూడొచ్చు. ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీనే ఉన్నా, తెలంగాణాలో 100 శాతం సిట్టింగ్ కి అనుమతి లభించడంతో.. ఎన్నో కొన్ని సినిమాలు క్యూ కట్టే అవకాశం ఉంది.
అయితే పాత సినిమాల్ని మళ్లీ రిలీజ్ చేసే ఆలోచన ఉంటే వెంటనే విరమించుకోవాలని థియేటర్ యజమానులు నిర్మాతలకు అల్టిమేట్టం జారీ చేశారు. ఈ యేడాది విడుదలైన క్రాక్, వకీల్ సాబ్, ఉప్పెన లాంటి సినిమాల్ని రీ రీలీజ్ చేసి, ప్రేక్షకులకు థియేటర్లని మళ్లీ అలవాటు చేయాలని నిర్మాతలు భావించారు. ముఖ్యంగా వకీల్ సాబ్ ని మరోసారి రీ రిలీజ్ చేసి, పవన్ అభిమానుల్ని ఆకర్షించాలని దిల్ రాజు పెద్ద ప్లానే వేశారు. ఆ ఆలోచనకు అడ్డుకట్ట పడినట్టైంది. పాత సినిమాల వల్ల.. టికెట్లు తెగవని, కొత్త సినిమాలు వస్తే తప్ప, థియేటర్లకు రావాలన్న ఉత్సాహం ప్రేక్షకులకు కలగదని, థియేటర్ యజమానులు చెబుతున్నారు. అందుకే పాత సినిమాలు విడుదల చేస్తే.. థియేటర్లు ఇవ్వం.. అంటున్నారు. సో.. వస్తే, గిస్తే.. కొత్త సినిమాలే రావాలన్నమాట. మరి ముందడుగు వేసేది ఎవరు??