కథల కొరత తీర్చడానికి హీరోలు నడుం కట్టారు. కాస్తో.. కూస్తో.. సృజన, అనుభవం ఉన్న కథానాయకులంతా.. కథల విషయంలో దర్శకులకు సహాయం చేసి పనిభారం తగిస్తున్నారు. కథా రచన, సహాయ దర్శకుడిగా పనిచేసిన అనుభవం ఉన్న వాళ్లైతే.. ఏకంగా కథే రాసేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లోని కొంతమంది హీరోలు.. కథలు రాస్తున్న వైనం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
నాని సహాయ దర్శకుడిగా తన ప్రయాణం ప్రారంభించాడు. దర్శకత్వం వైపు గురి ఉన్నా – ఇప్పట్లో ఆ దిశగా అడుగులేయడానికి రెడీగా లేడు. కానీ నిర్మాతగా మాత్రం బిజీనే. యేడాదికి కనీసం ఒక సినిమా తీయాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. ప్రస్తుతం `మీట్ – క్యూట్` అనే సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. మరోవైపు నాని ఓ కథ రెడీ చేశాడట. తన బ్యానర్‌లో రూపొందించే తదుపరి సినిమాకి.. తనే కథని అందించబోతున్నాడని తెలుస్తోంది. తన కథని సరిగా డీల్ చేసే దర్శకుడి కోసం నాని అన్వేషణ ప్రారంభించాడని సమాచారం.
అల్లరి నరేష్ కూడా సహాయ దర్శకుడిగా పని చేసిన వాడే. తనక్కూడా మెగాఫోన్ పట్టాలని ఆశ. అయితే దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు నరేష్ ఓ కథ సిద్ధం చేశాడట. అది తన కోసమే. కాకపోతే.. డైరెక్షన్ మాత్రం తాను చేయడని సమాచారం. ప్రస్తుతం ఈ కథ స్క్రిప్టు రూపంలో మారుతోందని, ఆ పనులు ఓ కొలిక్కి వచ్చాక… పూర్తి వివరాలు బయటకొస్తాయని సమాచారం. తన సినిమాలకు అప్పుడప్పుడూ స్క్రీన్ ప్లే అందిస్తుంటారు మోహన్ బాబు. తన తాజా చిత్రం `సన్ ఆఫ్ ఇండియా`కి కూడా మోహన్ బాబు కథ, స్క్రీన్ ప్లే విషయాల్లో సహాయ సహకారాలు అందించారు. టైటిల్ కార్డులో కూడా.. మోహన్ బాబు పేరు చూడొచ్చు. రవితేజ దగ్గర కూడా కొన్ని కథలు ఉన్నాయి. వాటిలోని ఓ కథ ఎంచుకుని దర్శకత్వం వహించాలన్నది రవితేజ ఆలోచన. ఇలా హీరోల్లో కొంతమంది కథల్ని సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. లాక్ డౌన్ వీళ్లకు పరోక్షంగా సహాయం చేసింది. ఆ ఖాళీ సమయం కథా రచనపై
దృష్టి పెట్టేలా చేసింది. మరి.. కథకులుగా వీళ్లంతా ఎలా రాణిస్తారో చూడాలి.