తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు నాంపల్లి కోర్టు ఆరు నెలల జైలు శిక్ష రూ. వెయ్యి ఫైన్ విధించింది. ఏ కేసులో అంటే.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయనను అడ్డుకున్న ఉద్యమకారులపై దాడి చేసిన కేసులో. 2015లో దానం నాగేందర్ మంత్రిగా ఉన్నారు. అది తెలంగాణ ఉద్యమం ఎగసిపడుతున్న సమయం. ఎక్కడికక్కడ ఉద్యమకారులు మంత్రుల్ని అడ్డుకుంటున్నారు. అలాంటి సమయంలో బంజారాహిల్స్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన దానం నాగేందర్ ను ఉద్యమకారులు అడ్డుకున్నారు. అప్పుడు స్వయంగా కారు దిగిన దానం నాగేందర్ కానిస్టేబుల్ చేతిలో ఉన్న కర్ర తీసుకుని ఉద్యమకారులపై విరుచుకుపడ్డారు.
ఆ ఘటనలో గాయపడిన ఓ వ్యక్తి పోలీసు కేసు పెట్టారు. ఆ కేసు విచారణ ఇటీవల ప్రారంభమైంది. ప్రజాప్రతినిధులపై కేసులను శరవేగంగా తేల్చాలని సుప్రీంకోర్టు ఇచ్చిన డైరక్షన్స్ ప్రకారం.. ప్రత్యేకంగా ప్రజాప్రతినిధుల కోర్టు ఏర్పాటైంది. అందులో విచారణలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో విచారణ పూర్తి కావడంతో దానం నాగేందర్‌కు శిక్ష ఖారారైంది. పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు శిక్షను నెల రోజుల పాటు కోర్టు వాయిదా వేసింది.
ఏ తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఆయన ఘర్షణలో పాలు పంచుకున్నారో.. ఇప్పుడు అదే తెలంగాణ ఉద్యమ పార్టీ నుంచి దానం నాగేందర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇటీవలే పార్టీ మారబోతున్నారన్న ప్రచారం జరిగిన్పపుడు… తాను చనిపోయే వరకూ టీఆర్ఎస్లోనే ఉంటానని ప్రకటించారు. ఆయన ప్రస్తావన వచ్చినప్పుడల్లా.. తెలంగాణ ఉద్యమకారులు.. ఆయన లాఠీ పట్టుకుని ఉద్యమకారులపై విరుచుకుపడిన ఘటనే గుర్తుకు తెచ్చుకుంటారు. ఇప్పుడు మరోసారి గుర్తు తెచ్చుకుంటారు.