పీటల మీద పెళ్లి ఆగిపోయినా ఖర్చు ఖర్చే. అసలు కార్యక్రమం ఆగిపోయిందనే బాధ ఒకటి.. ఆడంబరంగా పెట్టిన ఖర్చు అంతా వృధా అయిందనే బాధ మరొకటి… ఆ కుటుంబ పెద్దను మెలి పెడుతుంది. ఇలాంటి బాధను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిన్న అనుభవించారు. అసలు జీతాలకు నిధుల్లేక ఆర్బీఐ దగ్గర చాలా చాలా వడ్డీకి రుణాలు తెస్తూంటే.. ఆ సొమ్మును ఉపయోగించని వాటికి చెల్లించాల్సి రావడం ప్రభుత్వ పెద్దకు ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆర్బీఐ నుంచి అప్పు చేతికి అందిన తర్వాత అత్యవసరంగా చెల్లించాల్సిన వాటికి నిధులు మంజూరు చేశారు. వాటిలో తిరుపతిలో జరగకుండా ఆగిపోయిన ఓ సమావేశానికి సంబంధించి రూ. కోటి పన్నెండు లక్షల బిల్లును మంజూరు చేశారు. అంత ఖర్చు పెట్టి ఏం చేశారు.. ఇంతకీ ఆ సమావేశం ఏమిటి.. అన్న ఉత్సుకత చాలా మందిలో కనిపించింది.
మూడు నెలల కిందట.. తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం జరగాల్సి ఉంది. అమిత్ షా ఆధ్వర్యంలో ఆ సమావేశం జరగాల్సి ఉంది. దీనికి ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై పడింది. కేంద్రహోంమంత్రితో పాటు దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు వస్తారు కాబట్టి.. దానికి తగ్గట్లుగా ఏర్పాట్లు చేయడానికి రూ. నాలుగు కోట్ల ఖర్చు అంచనా వేశారు. అవసరాలు చెప్పి.. కాంట్రాక్టర్‌కు పనులు ఇచ్చారు. ఆయన తన పని తాను చేశారు. కానీ చివరికి…అమిత్ షా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండటంతో సమావేశం రద్దయింది. కానీ.. చేసిన ఏర్పాట్లకు మాత్రం ఖర్చులయ్యాయి.
ఆ కాంట్రాక్టర్ వైసీపీ పెద్దలకు సన్నిహితుడుకావడంతో .. ఆయన తనకు రావాల్సిన బిల్లుల గురించి అదే పనిగా రిమైండర్లు పెట్టుకున్నారు. చివరికి కనికరించి ఆయనకు నిధులు విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఆయనకు కోటి పన్నెండు లక్షలు విడుదల చేయాల్సి వచ్చింది. ఆర్థిక కష్టాల్లో ఉన్న ప్రభుత్వానికి అసలు సమావేశం జరగలేదు కానీ… డబ్బులు మాత్రం పోయాయన్న ఆవేదన ఏర్పడింది.