” నాకు అధికారం అవసరం లేదు.. అధికారం కోసం పార్టీ పెట్టలేదు..” అంటూ.. మొదటి మాట చెబితే.. ఏ రాజకీయ పార్టీ కార్యకర్తకు అయినా ఉత్సాహం వస్తుందా..?. రాకపోగా.. ఆ మైండ్‌సెట్‌ని చూసి నిరుత్సాహానికి గురవుతారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పుడు ఏ మీటింగ్‌లో చూసినా ఇదే మొదటగా చెబుతారు. దాంతో ఆయన చెప్పాలనుకున్న మ్యాటర్ మొత్తం లైటర్వీన్లోకి వెళ్లిపోతుంది. ఇక ఆయన ఎందుకు రాజకీయాల్లోకి వచ్చారు అన్న ప్రశ్న.. సహజంగానే ఆయన అభిమానుల మెదళ్లలోకి వెళ్లిపోతోంది. ఇక ఇతరుల గురించి చెప్పాల్సిన పని లేదు. అసలేం కావాలో పవన్ కల్యాణ్‌కే తెలియదని డిసైడైపోతున్నారు.
రాజకీయాల్లోకి వచ్చేది అధికారం కోసం కాదా..? ఎందుకు ఆ స్టేట్మెంట్లు..!?
చాలా రోజుల తర్వాత అమరావతి వచ్చిన పవన్ కల్యాణ్… కార్యవర్గాన్ని ఏర్పాటుచేసి.. వారికి చేసిన హితబోధలోనూ.. ఇదే మొదటగాఉంది. అధికారం అక్కర్లేదు అని. అధికారం కోసం రాజకీయ పార్టీ పెట్టారంటే ప్రజలు ఏదో అనుకుంటారని పవన్ కల్యాణ్ మొహమాటం పడుతున్నట్లుగా ఉన్నారు. కానీ ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టేది అధికారం కోసమే. ఆ విషయం తెలియనంత అమాయకులు కాదు జనం. అధికారం లేకుండా ప్రజలకు సేవ చేయాలనుకుంటే… జయప్రకాష్ నారాయణ లాగా…ఏ లోక్ సత్తానో పెట్టుకుంటారు. ఆయన కూడా రాజకీయం చేసి.. తన వల్ల కాదని రెస్ట్ తీసుకుంటున్నారు అది వేరే విషయం. అధికారం చేపట్టి ప్రజల బతుకుల్ని మార్చాలనే పార్టీలు పెడతారు. అలా అని పైకి చెబుతారు. అప్పుడే అతనికి.. ఆ నేతకు సీరియస్ నెస్ ఉంటుంది. కానీ పవన్ కల్యాణ్ మాత్రం.. మొట్ట మొదటి మాటగా.. తనకు అధికారం అవసరం లేదు.. అధికారం కోసం రాలేదు అనే మాటలు వినిపిస్తూ ఉంటారు.
లక్ష్యంగా సూటిగా లేనప్పుడు ఫ్యాన్స్ లో మాత్రం సీరియస్‌నెస్ ఎలా ఉంటుంది..?
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆయన తన లక్ష్యాన్ని సూటిగా సుత్తి లేకుండా చెప్పారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకు రావడమే లక్ష్యమన్నారు. ప్రజల బాధలను తీర్చేది కాంగ్రెస్ పార్టీనేనన్నారు. ఆయన తాను సీఎం అవుతానని ఎక్కడా చెప్పలేదు. కానీ.. పార్టీని అధికారంలోకి తీసుకు వస్తానని అదే లక్ష్యమని చెప్పారు. ప్రజలకు అది సూటిగా తలుగుతుంది. అంతే కానీ అధికారం ముఖ్యం కాదు ప్రజల కోసం పోరాడతాననే కబుర్లు చెబితే… ఎవరు నమ్ముతారు..? జనసేనకు స్ట్రాటజిస్టులు ఉన్నారో లేదో కానీ.. స్క్రిప్ట్ కోఆర్డినేటర్లు మాత్రం ఖచ్చితంగా ఉండే ఉంటారు. వారు.. పవన్ కల్యాణ్ బాడీ లాంగ్వేజ్ స్టైల్‌ను చూసుకుని డైలాగులు రాయకుండా.. కాస్త జనంను దృష్టిలో పెట్టుకుని స్పీచ్‌లు రాయాల్సి ఉంది.
అధికారం కోసమే అని చెబితేనే ప్రజలూ నమ్ముతారు..!
రాజ్యాధికారమే జనసేన లక్ష్యం కాదు.. నా ఒక్కడి పదవి, గెలుపు కోసం నేను రాజకీయాల్లోకి రాలేదు … నా స్వార్ధం చూసుకుంటే ఏ పార్టీలోకి వెళ్లినా.. నాకు సముచిత స్థానం ఉండేది… ఇలాంటి కబుర్లు చెప్పడం… చేతకాని తనం అవడం మాత్రమే కాదు… వ్యూహాత్మక లోపం అవుతుంది. ప్రజల్లో .. పార్టీపై సీరియస్ నెస్ లేకుండా చేస్తుంది. దీన్ని పవన్ కల్యాణ్ ఎప్పుడు గుర్తిస్తారో ..!?