భారతీయ రైల్వే ప్రపంచంలో పెద్ద సంస్థగా పేరొందింది. అయితే గత రెండు దశాబ్దాలుగా దాన్ని ప్రభుత్వాలు ఘోరంగా నిర్లక్ష్యం చేస్తున్నాయి. కేంద్రం నిధులు కేటాయించడం లేదు. రవాణాపై తగినంత ఆదాయం రావడం లేదనీ, ప్రయాణీకుల ఛార్జీలపై వచ్చే ఆదాయం చాలదని. మారు మూల మార్గాలకు లైన్లు వేయడం వ్యర్థమనీ రకరకాల సిద్దాంతాలు తీసుకొచ్చారు. ఏతావాతా ప్రైవేటు భాగస్వామ్యం ప్రైవేటు పెట్టుబడులే పరిష్కారమార్గమని కూడా తేల్చి పారేశారు. ప్రధాని నరేంద్ర మోడీ ఏరికోరి సురేష్ ప్రభును శివసేన నుంచి తీసుకొచ్చి రైల్వేశాఖ అప్పగించారు. అయితే ఆయన పనితీరుపై మోడీ నిరాశ చెందారని రాజకీయ వర్గాల కథనం. ప్రైవేటు పెట్టుబడులను రాబట్టడంలో సురేష్ జయప్రదం కాలేకపోవడమే ఇందుకు కారణమంటున్నారు. ప్రధాని కార్యాలయం నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ నృపేంద్ర మిశ్రా ఈ మేరకు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఒక లేఖ రాశారు. వనరులు సమీకరించుకోలేదంటూ ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రు.12000 కోట్ల బడ్జెట్ మద్దతును కూడా ఉపసంహరిస్తే నానా పాట్లు పడి పునరుద్దరించుకున్నారు. ఈ సారి బడ్జెట్‌పై తమకు ఎలాటి ఆశలూ లేవని పలువురు ముఖ్యమంత్రులే గాక రైల్వే శాఖ ప్రతినిధులు కూడాచెబుతూ వచ్చారు. దానికి తగినట్టే బడ్జెల్ రూపొందింది. ప్రైవేటు భాగస్వామ్యం గురించి ఇంతగా చెప్పినా చివరకు ఎల్ఐసి నుంచి1.25 లక్షల కోట్లు రుణం తప్ప వచ్చిన వనరులేమీ లేవు. రైల్వేలను మరింతగా తమకు ధారాదత్తం చేస్తే తప్ప స్పందించబోమనే వైఖరి తీసుకున్నారు కార్పొరేట్లు. అసోచెమ్ ఇచ్చిన నివేదికలోనైతే ప్రయాణీకుల ఛార్జీలు పెంచాలని తమ రవాణా చార్జిలు తగ్గించాలని బహిరంగంగా సూచించారు. ఇప్పుడు రైల్వేలను విమానాలకు దీటుగా రూపొందిస్తే సంపన్న ప్రయాణీకులు వాయు మార్గం వదిలి రైలు మార్గం పడతారనేది కేంద్రం ఆలోచనగా వుంది. కనుక రానున్న రోజుల్లో ఉన్నత వర్గాల సదుపాయాలపై శ్రద్ద వుంటుంది గాని సామాన్య ప్రయాణీకులను మారుమూల మార్గాలను పట్టించుకునే అవకాశం వుండదు. పైగా ఎయిర్ ఇండియాను దివాళా తీయించినట్టుగా రైల్వేలను దెబ్బతీస్తే ప్రైవేటు రంగానికి ఇచ్చేయొచ్చన్న భావన బలంగా పనిచేస్తున్నది. రవాణాకు సంబంధించి కూడా సుదీర్ఘ తీరం, గనులు, ఉక్కు కర్మాగారం వున్న ఆంధ్ర ప్రదేశ్ గాని, బొగ్గు నిక్షేపాలు వున్న తెలంగాణ గాని చాలా కీలకమైనవి. అయితే వీటిపై శ్రద్ద పెట్టి అభివృద్ధి చేసేబదులు ప్రైవేటు శక్తులకు అప్పగిస్తే పోతుందనే ఆలోచనలు సాగుతున్నాయి. రైల్వే స్టేషన్లను భూములను కార్పొరేట్లకు అప్పగిస్తే మాల్స్‌గా ఎంటర్టైన్ మెంట్ సెంటర్స్‌గా తీర్చిదిద్దుతారని పథకాలు వేస్తున్నారు. కనుక ప్రజా రైల్వేలు ఇక గతానికి సంబందించిన మాటే అవుతుంది. మరో అయిదేళ్లలో ఇక్కడా పూర్తి ప్రైవేటు ఆధిక్యత వచ్చేస్తే ఆశ్చర్య పోనవసరం లేదు. గతంలో చేసిన వాగ్దానాలు నెరవేర్చడం తప్ప కొత్తగా చేపట్టేది లేదని సురేష్ ప్రభు ఒకటికి రెండు సార్లు చెప్పడంలో ఉద్దేశం అదే.