జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ కోర్టులో రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్ అటు జగన్ కన్నా.. ఇటు సీబీఐని ఎక్కువ ఇబ్బంది పెడుతున్నట్లుగా ఉంది. ఏం చెప్పాలో.. ఏం చేయాలో తెలియక సతమతమవుతోంది. గత వాయిదాలో తాము లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తామని కోర్టుకు తెలిపిన సీబీఐ .. ఈ వాయిదాలో మాత్రం మాట మార్చింది. వాదనలు సమర్పించేందుకు నిరాకరించింది. దీంతో సీబీఐ కోర్టు తదుపరి విచారణను పధ్నాలుగో తేదీకి వాయిదా వేసింది. అసలు సీబీఐ సమస్య ఏమిటో చాలా మందికి అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
మొదట్లో.. రఘురామ పిటిషన్ను విచారణకు స్వీకరించి.. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐ కోర్టు ఆదేశించినప్పుడు.. మూడు సార్లు వాయిదాలు కోరిన సీబీఐ.. చివరికి కోర్టు ఆగ్రహించి..ఇక గడువు ఇచ్చేది లేదని చెప్పడంతో.. కౌంటర్ దాఖలు చేసింది.కానీ ఆ కౌంటర్ మూడు అంటే మూడు లైన్లలోనే ఉంది. తాము ఎలాంటి అభిప్రాయం చెప్పబోమని.. కేసు మెరిట్స్ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని అందులో సూచించారు. దీంతో సీబీఐ తీరుపై విస్మయం వ్యక్తం అయింది.
తర్వాత వాదనల సమయంలోనే అదే తీరును ప్రదర్శిస్తోంది. అయితే రఘురామ తరపు లాయర్ అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. లిఖిత పూర్వక వాదనలు సమర్పిస్తామని చెప్పారు. కానీ తర్వాత ఏం జరిగిందో కానీ.. అది కూడా చేయబోమని వెనక్కి తగ్గారు. దీంతో.. ఈ బెయిల్ రద్దు పిటిషన్ విషయంలో.. సీబీఐపై తీవ్రమైన ఒత్తిడి ఉందన్న ప్రచారం జరుగుతోంది. పరిణామాలు చూస్తూంటే అదే నిజమనిపిస్తోందని.. టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సీబీఐ గతంలో గుర్తించిన అంశాలు..నేరాలను కూడా పట్టించుకోవడం లేదని.. ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని.. ఆరోపిస్తున్నారు. సీబీఐ ఇదే తీరుగా ఉంటే.. సాధారణ ప్రజలు కూడా అలాగే అనుకునే అవకాశం ఉంది.