సలహాదారుగా ఉండి రాజకీయాలు మాట్లాడటం ఏమిటని ఏపీ హైకోర్టు ఆశ్చర్యపోయింది. నీలం సాహ్నిని సలహాదారుగా నియమించడంపై దాఖలైన పిటిషన్‌పై విచారణలో ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ ప్రభుత్వంలో ఇప్పుడు సలహాదారులదే రాజ్యం. ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి అనే సలహాదారు మొత్తం చక్రం తిప్పుతున్నారు. ప్రతీ దానికి మీడియా ముందుకు వచ్చి వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలను ప్రకటిస్తున్నారు. ప్రతిపక్షాలను విమర్శిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తానే ఒంటి చేత్తో నడుపుతున్నట్లుగా షో చేస్తున్నారు. ఆయన తీరుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వస్తున్నాయి. తాజాగా హైకోర్టు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
కోర్టులో వాదనలు వినిపిస్తున్న ప్రభుత్వ న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి గతంలో ఏజీగా పని చేశారు. అదే విషయాన్ని న్యాయమూర్తి గుర్తు చేస్తూ.. ఆ సమయంలో సలహాదారులు రాజకీయాలు మాట్లాడేవారా.. అని ప్రశ్నించారు. సీవీ మోహన్ రెడ్డి కూడా అలాంటిదేమీ లేదని కోర్టుకు చెప్పాల్సి వచ్చింది. దీంతో అసలు సలహాదారులు ఎవరు.. ఎలా నియమిస్తారు…వారి పనులేంటో చెప్పాలని హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇప్పుడు ప్రభుత్వానికి సలహాదారుల చిక్కు వచ్చి పడే అవకాశం కనిపిస్తోంది. ప్రభుత్వానికి పెద్ద ఎత్తున సలహాదారులు ఉన్నారు. అయితే చాలా మంది… గతంలో వైసీపీ కోసం పని చేస్తూ.. గత ప్రభుత్వంపై విమర్శలు చేసినందుకు ప్రతిఫలంగానే ఇచ్చారు. మరికొంత మందికి సాక్షి మీడియాలో జీతాల భారం తగ్గించుకోవడానికి ఇచ్చారన్న ప్రచారం ఉంది. వీరెవరూ పెద్దగా మీడియా ముందుకు రారు.
సలహాలు కూడా ఇస్తారని ఎవరూ అనుకోవడం లేదు. కానీ సజ్జల.. ఆయన నిర్దేశిస్తే.. అజేయ కల్లాం మాత్రం మీడియాతో మాట్లాడతారు. కోర్టు ఆక్షేపణ దృష్ట్యా… సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారు పదవికి రాజీనామా చేసినా ఆయనకు పోయేదేమీ ఉండదు కాకపోతే.. ప్రజాధనాన్ని జీతంగా తీసుకోవడం మాత్రం ఆపేయాల్సి ఉంటుంది. రాజ్యాంగేతర శక్తిగా.. ఆయన తన పవర్‌ను.. ప్రభుత్వాన్ని నడుపుకోవచ్చు. ఎలాంటి అధికారిక హోదా ఉండదు కాబట్టి.. హైకోర్టు కూడా ఎలాంటి కట్టడీ చేయలేదు.