తన మంత్రి వర్గ సహచరి సృతి ఇరానీ ప్రసంగ ప్రభంజనానికి ముగ్ధులై సత్యమేవజయతే అని ట్వీట్ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. అయిత హెచ్‌సియు విద్యార్థి రోహిత్ మృతికి సంబంధించి ఆమె చెప్పిన వాటిలో చాలా భాగం అవాస్తవాలని తేలిపోయింది. స్వయానా ఆ రోజున అతని మృత దేహాన్ని చూసిన వైద్యులు, నాటి సిబ్బంది, పోలీసులు అందరూ సాక్ష్యాధారాలతో సహా నిజాలు ఏమిటో లోకమంతటికీ తెలియజేశారు. రాజకీయ కారణాల వల్ల తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వివాదం పెంచుకోకపోయినా ప్రభుత్వాధికారులు కేంద్రంతో సంప్రదించారనే వివరాలు కూడా వెల్లడించారు. రోహిత్ ఎబివిపి విద్యార్థిని కొట్టాడనే విధంగా ఆమె చెప్పింది పూర్తిగా అవాస్తవమే. ఇక కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ,ఫిర్యాదు మానవ వనరుల శాఖ తరపున తన జోక్యం ఉత్తరాలతో సహా కనిపిస్తుంటే ఎలాంటి ఒత్తిడి లేదని చెప్పడం కూడా నిజం కాదని అర్థమైపోయింది. జెఎన్‌యు విషయంలోనూ అనవసర ప్రస్తావనలతో వాతావరణం చెడగొట్టినట్టు రాజ్యసభ సాక్షిగా రుజువైంది.దుర్గామాతపై ఎవరో ఏదో పోస్టరు వేశారని చదివి వినిపించడం పొరబాటని ప్రతిపక్షం చేసిన విమర్శకు ప్రభుత్వం తలవంచవలసి వచ్చింది. ఆమె చదివిన భాగాలూ వ్యాఖ్యలూ తొలగిస్తానని ఉపాద్యక్షుడు కురియన్ ప్రకటించారు. బెంగాల్లో సంథాల్ తెగలు మహిషాసురుణ్ని పూజించడానికి సంబంధించిన సమాచారాన్ని ప్రముఖ బెంగాలీ పత్రికలే ప్రచురించాయి. మహిషాసురుడి పేరు మీద మా నగరం ఏర్పడింది గనక మమ్ముల్ను దేశ ద్రోహులంటారేమో నని కొంతమంది ట్వీట్ చేశారు. సత్యమేవజయతే నినాదం ఇచ్చిన అశోకుడు పరమత సహనం బోధిస్తే దాన్నిద్వేషానికి వాడుకోవడం తప్పు కదా?