మా మేనమామ చిన్న కొడుకు ఏపీఐఐసీ సభ్యుడి పదవి వచ్చిందోచ్ అని.. ఓ ఫేస్ బుక్ పోస్టులో ఏపీసీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ సంబరంగా చెప్పుకున్నారు. ఆ మేనల్లుడి పేరు నూతలపాటి సోనీవుడ్. ఏపీపీఎస్సీ సభ్యుడిగా నియామకం కావాలంటే… ఎంతో కొంత పేరు ప్రఖ్యాతలు ఉండాలి..మరి ఆయనకేం ఉందంటే… ఆయన నజెరత్ సొసైటీ పేరుతో స్వచ్చంద సంస్థ నిర్వహిస్తున్నారు. అనాథలైన బాలబాలికలు.. లైంగిక వేధింపులకు గురైన చిన్నారులకు ఆశ్రయం ఇస్తానంటూ ఆయన ఆశ్రమాలు నడుపుతున్నారు. కానీ..ఆయన ఆ పేరుతో మత మార్పిళ్లకు పాల్పడుతున్నారని.. ఆ అమాయకులైన బాల బాలికల్ని చూపించి… విదేశీ నిధులు సేకరిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై జాతీయ బాలల హక్కుల కమిషన్ విచారణ ప్రారంభించింది.
స్కాట్లాండ్కు చెందిన ఓ వెబ్సైట్లో తూర్పుగోదావరి జిల్లా తునిలో ఉన్న ఓ అనాథశ్రమానికి చెందిన పిల్లల ఫోటోలు కనిపించాయి. వారి మతం మార్చినట్లుగా.. వారిని ఉద్ధరించినట్లుగా అవి ఉన్నాయి. దీనిపై జాతీయ బాలల హక్కుల కమిషన్కు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో నజరత్ అసోసియేషన్ ఆఫ్ సోషల్ అవేర్ నెస్, నజరత్ ఎడ్యుకేషనల్ సొసైటీపై విచారణ జరపాలని జాతీయ బాలల హక్కుల కమిషన్ .. ఏపీ సీఎస్ ఆదిత్యనాధ్ను ఆదేశించింది. ఏపీలో నాలుగు చోట్ల స్వచ్చంద సేవ ముసుగులో అనాథ ఆశ్రమాలను నడుపుతోందని.. అయితే.. అక్కడ ఆశ్రయం పొందుతున్న పిల్లలకు సంబంధించిన సమాచారాన్ని విదేశాలకు చేరవేస్తున్నారని ఫిర్యాదులు జాతీయ బాలల హక్కుల కమిషన్కు వెళ్లాయి. దానికి సంబంధించిన ఆధారాలను కూడా ఫిర్యాదుకు జత చేశారు.
నజెరత్ సొసైటీ ఆ బాలబాలికలను చూపించి మత మార్పిళ్లకు పాల్పడ్డామని చెప్పి.. నిధులు సమకూర్చుకున్నట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. చట్టం ప్రకారం.. లైంగిక వేధింపులకు గురైన వారి వివరాలు బయట పెట్టడం కానీ.. విదేశాలకు చేర వేయడం కానీ నేరం. ఇలా చేయడం పోక్సో చట్టం కింద శిక్షార్హం. ఇలా చేయడం వెనుక దురుద్దేశం ఉన్నట్లుగా భావిస్తున్నారు. అందుకే జాతీయ బాలల హక్కుల కమిషన్ తక్షణం విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. జాతీయ బాలల హక్కుల కమిషన్ ఆదేశాలపై ఏపీ సీఎస్ కూడా వెంటనే స్పందించారు. రెవిన్యూ, పోలీసు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులను నాసా సొసైటీ నిర్వహిస్తున్న విద్యా సంస్థల వద్దకు పంపారు. అధికారులు విద్యార్థినులతో మాట్లాడి స్టేట్మెంట్లు రికార్డు చేశారు. ఇప్పుడీ సంస్థ సోనీవుడ్ది కావడం.. సీఐడీ ఏడీజీ సునీల్ బంధువు కావడంతో.. సోదాలే ఉంటాయని.. చర్యలు ఉండవని సహజంగానే విమర్శలు వినిపిస్తున్నాయి.