తెలంగాణ రాష్ట్ర సమితి .. రేవంత్ రెడ్డిని ఎదుర్కోవడానికి ఆయనపై టీడీపీ ముద్ర వేయడం ఒక్కటే మార్గంగా భావిస్తున్నట్లుగా ఉంది. రేవంత్ పీసీసీ చీఫ్ అయినప్పటి నుండి ఆయన టీడీపీ అనే విమర్శలు చేస్తున్నారు. నిన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి టీడీపీ కోణంలోనే విమర్శించగా.. ఈ రోజు హరీష్ రావు కూడా అదే ప్లాన్ అమలు చేశారు. టీడీపీని మరోసారి తెలంగాణ ప్రజలు రానివ్వరని.. చంద్రబాబు కాంగ్రెస్ ముసుగులో మళ్లీ తెలంగాణకు వస్తున్నారని హరీష్ రావు చెప్పుకొచ్చారు. తనవారిని కాంగ్రెస్‌లోకి పంపి అధికారంలోకి రావాలని చంద్రబాబు చూస్తున్నారని హరీష్ రావు లాజిక్ చెబుతున్నారు. వీరి విమర్శలకు రేవంత్ రెడ్డి కూడా వెంటనే కౌంటర్ ఇచ్చారు.
తాను టీడీపీ అయితే.. కేసీఆర్ ఎక్కడ్నుంచి వచ్చారని ప్రశ్నించారు. నాపై విమర్శలు చేసేందుకు హరీష్‌రావు, కేటీఆర్ పోటీ పడుతున్నారని కేసీఆర్, కేటీఆర్‌ల బతుకు టీడీపీ అయితే.. హరీష్‌రావుది కాంగ్రెస్ అని మీడియా ప్రతినిధులతో చేసిన చిట్ చాట్ లో ఘాటుగా వ్యాఖ్యానించారు. టీ కాంగ్రెస్ టీడీపీ అయితే.. టీఆర్ఎస్ కూడా టీడీపీనే.. కేసీఆర్ కేబినెట్లో 75 శాతం మంత్రులు టీడీపీవారేనని గుర్తు చేశారు. రేవంత్‌పై టీడీపీ ముద్ర వేస్తే తప్ప వర్కవుట్ కాదని టీఆర్ఎస్ నేతలు ఎందుకనుకుంటున్నారో కానీ.. తాజాగా చంద్రబాబు రేవంత్ కన్నా సన్నిహితునిగా పేరున్న రమణను పార్టీలో చేర్చుకుని హుజూరాబాద్ నుంచి నిలబెట్టాలనే ఆలోచన చేస్తున్నారు.
ఇవన్నీ చర్చకు వస్తాయన్న విషయాన్ని పట్టించుకోవడం లేదు. చంద్రబాబును బూచిగా చూపెట్టడం ద్వారా గత ఎన్నికల్లో మంచి ఫలితాలు వచ్చాయని టీఆర్ఎస్ నమ్మకంతో ఉన్నట్లుగా ఉంది. ఈ సారి కూడా.. రేవంత్ రెడ్డిని.. చంద్రబాబు మనిషి అని చెప్పడం ద్వారా అదే ఫలితాలను సాధించాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అయితే ప్రతీ సారి అది వర్కవుట్ అవుతుందో లేదో తెలియదు కానీ.. టీడీపీ మాత్రం.. తెలంగాణలో మరోసారి చర్చనీయాంశం అవుతోంది.