ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు ఇస్తున్నారని న్యాయమూర్తులపై ఇష్టం వచ్చినట్లుగా దూషణలకు పాల్పడ్డ వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు అసలు సెగ తగలడం ప్రారంభమయింది. గల్ప్‌లో ఉపాధి పొందుతూ అక్కడే ఉండే లింగారెడ్డి రాజశేఖర్ రెడ్డి అనే కార్యకర్త పాస్‌పోర్ట్‌ను సీబీఐ రద్దు చేసింది. దీంతో ఆయన వెనక్కి తిరిగి రాక తప్పలేదు. ఇండియాలో అడుగుపెట్టగానే సీబీఐ అతన్ని అదుపులోకి తీసుకుంది. అరెస్ట్ చూపించింది. ఇప్పుడీ వ్యవహారం సంచలనాత్మకం అవుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే అలజడి రేపుతోంది. మొత్తం 22 మంది వైసీపీ కార్యకర్తలను నేడో రేపో సీబీఐ అరెస్ట్ చేయబోతోందన్న ప్రచారం జరురుగుతోంది.
లింగారెడ్డి పాస్ పోర్టును రద్దు చేసిన తర్వాత అతను ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు. తన జీవితం సంకనాకిపోయిందని.. అయినా జగన్ అన్న ఆదుకుంటాడన్న నమ్మకం ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. అయితే ఇప్పుడు.. ఆయన ఫేస్‌బుక్ అకౌంట్ కూడా కనిపించకుండా పోయింది. గల్ఫ్‌లో ఉద్యోగం పోగొట్టుకుని ఇండియాకు వచ్చి సీబీఐ చేతుల్లో చిక్కారు. వైసీపీ తరపున కానీ… ప్రభుత్వం తరపున కానీ ఎలాంటి సాయం అందకపోవడంతో.. ఇతర వైసీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ .. పోస్టులు , కామెంట్లు పెడుతున్నారు. ఇవి మరీ పెరిగిపోతూండటంతో… వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న… ఏపీ ప్రభుత్వ డిజిటల్ డైరక్టర్ గుర్రంపాటి దేవేందర్ రెడ్డి .. స్వయంగా తన ఫేస్‌బుక్ పేజీలో ఓ పోస్టు పెట్టారు. వైసీపీ కార్యకర్తలు ఎవరూ పెద్దగా ఆవేశపడి.. లేనిపోని పోస్టులు పెట్టవద్దని లింగారెడ్డి విషయంలో ప్రభుత్వం సాయం చేస్తుందని.. అయితే కొన్ని పరిమితులు ఉన్నాయని చెప్పుకొచ్చారు.
గుర్రంపాటి కూడా.. పరిమితుల గురించి చెప్పడంతో ఇక సీబీఐ కేసులు పడినవారిని రక్షించడానికి వైసీపీ కూడా ప్రయత్నించే అవకాశాలు లేవన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లోనే ఏర్పడింది. న్యాయవ్యవస్థపై నిందలు వేసిన వారిని హైకోర్టు అంత తేలిగ్గా వదిలి పెట్టే అవకాశం లేదు. సీఐడీ సరిగ్గా చర్యలు తీసుకోకపోవడంతో వ్యవహారం.. సీబీఐ వరకూ వెళ్లింది. ఇప్పుడు సీబీఐ.. విదేశాల్లో ఉన్న వారిని కూడా రప్పించి మరీ అరెస్టులు చేస్తోంది. అదే సమయంలో.. ముందు ముందు ప్రముఖులపైనా అదే తరహా కేసులు.. అరెస్టులు చేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.
తమకు అధికార పెద్దల అండ ఉందని.. న్యాయవ్యవస్థపైనా ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు చేసినా.. తమను ఎవరూ ఏమీ చేయలేరనుకున్న కొంత మంది వైసీపీ కార్యకర్తలు… వారి మార్గదర్శకులు చెప్పిన మాటలు విని పోస్టులు పెట్టి.. జీవితాలను కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు వారికి అండగా ఉండటానికి ప్రభుత్వం సిద్ధపడితే.. న్యాయవ్యవస్థను కించ పరిచిన వారిని ప్రభుత్వమే ప్రోత్సహించిందన్న అభిప్రాయం ఏర్పడుతుంది. ఒక వేళ వారిని పట్టించుకోకపోతే.. కార్యకర్తలు విశ్వాసం కోల్పోతారు.