ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు రోజుల తన కడప జిల్లా పర్యటనలో ఎప్పుడూలేని విధంగా కొత్త రాగం వినిపించారు. అదేమిటంటే.. కడప జిల్లా అభివృద్ధి చెందలేదని.. ఇక మహర్దశ పడుతుందని… అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా కడపను తీర్చిదిద్దుతానని చెప్పుకొచ్చారు. ఈ మాటలు విన్న కడప వాసులే కాదు.. ఏపీ మొత్తం ఆశ్చర్యపోయింది. ఎందుకంటే కడప జిల్లాలో గత మూడు, నాలుగు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానిదే ఆధిపత్యం. ఏ పార్టీప్రభుత్వం వచ్చినా… ఎవరు అధికారంలో ఉన్నా కడప జిల్లాలో ఏ కార్యక్రమం జరగాలన్నా అది వైఎస్ కుటుంబం కనుసన్నల్లోనే జరగాలి. మొత్తం వారి గుప్పిట్లోనే ఉంటుంది. మరి ఇప్పుడు కడపను పట్టించుకోలేదని నిందిస్తే.. ప్రజలు అందరూ ఎవరి వైపు చూడాలి..!?
ఎవరి వరకో ఎందుకు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఐదేళ్లు ఉన్నారు. సీఎం జగన్ మరో రెండేళ్లు ఉన్నారు. ఈ కాలంలో ఏం అభివృద్ధి చేశారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో కడపలో.. పులివెందులలో వైఎస్ కుటుంబానికి పెద్ద పెద్ద ఇళ్లు.. ఇడుపులపాయ ఎస్టేట్‌లో భారీ ఫామ్ హౌస్ లాంటివి సమకూరాయి. అంతో ఇంతో పులివెందులకు కాస్త అభివృద్ధి పనులు జరిగాయి. సీఎంగా జగన్ ఉన్న రెండేళ్ల కాలంలో.. వందల కోట్లతో జీవోలు ఇచ్చారు కానీ పనులు మాత్రం చేయడం లేదు. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లుగా ఉంది. పులివెందులలో వైఎస్ కన్నా ఎక్కువ అభివృద్ధి పనులు చేసి ప్రజల మెప్పు పొందాలని గత ప్రభుత్వం వందల కోట్లు కుమ్మరించింది. ఆ పనులను కూడా జగన్ ముందుకు తీసుకెళ్లడంలో తడబడుతున్నారు. అయినా వైఎస్ పోయాక ఎవరూ కడపను పట్టించుకోలేదని చెబుతున్నారు.
తమ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా.. కడపలో వైఎస్ కుటుంబానిదే దశాబ్దాలుగా ఆధిపత్యం కాబట్టి.. అక్కడ ప్రజలు వెనుకబడి ఉన్నా.. అక్కడ శాంతిభద్రతలు అథమ స్థాయిలో ఉన్నా… అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోయినా దానికి పూర్తి బాధ్యత వైఎస్ కుటుంబమే వ్యవహరించాల్సి ఉంటుంది.ఆ నెపాన్ని కూడా గత ప్రభుత్వాలపై నెట్టేస్తే అదీ కూడా సీఎం హోదాలో ఉండి.. చేత కాని తనమే అవుతుంది. ఇప్పటికైనా కడపలో సాధారణ ప్రజాస్వామ్య జీవితాలను ప్రజలకు ప్రసాదిస్తే ఇతర జిల్లాల్లాగే అభివృద్ధి చెందుతుంది. లేకపోతే.. కడప గురించి మరో పదేళ్ల తర్వాత కూడా సీఎం జగన్ ఇప్పుడు చెబుతున్న మాటల్నే చెప్పుకోవాల్సి ఉంటుంది.