అమెరికా వెళ్లేందుకు చాలా కాలంగా కోర్టు అనుమతి కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ ఎంపీ సుజనా చౌదరికి తెలంగాణ హైకోర్టు ఎట్టకేలకు శుభవార్త వినిపించింది. ఈ నెల 12వ తేదీ నుంచి ఆగస్టు 11 వ తేదీ వరకూ అంటే ఓ నెల పాటు అమెరికాలో పర్యటించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్ల సాంకేతికతపై చర్చించేందుకు అత్యవసరంగా అమెరికా వెళ్లాల్సిన అవసరం ఉందని హైకోర్టుకు కారణం చెప్పారు. అమెరికా వెళ్లేందుకు హైకోర్టు అనుమతి తీసుకోవాలని సుజనా చౌదరి ఎందుకు అనుకున్నారంటే.. సీబీఐ వాళ్లు మధ్యలో ఆపేస్తారేమోనని బయపడి. గతంలో ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. వాటిని ఉపసంహరించలేదు.
సుజనా చౌదరి టీడీపీలో ఉన్నప్పుడు ఆయనపై పలు సీబీఐ కేసులు నమోదయ్యాయి. టీడీపీ ఓడిపోయిన తర్వాత ఆయన బీజేపీలో చేరారు. భారతీయ జనతా పార్టీలో చేరి.. బ్యాంకులకు లోన్లు ఎగ్గొట్టిన కేసుల నుంచి విచారణ వేధింపుల గండం గట్టెక్కిన ఎంపీ సుజనా చౌదరికి కొత్త కష్టాలొచ్చాయి. గతంలో బ్యాంకుల ఫిర్యాదు మేరకు కేంద్ర దర్యాప్తు సంస్థలు జారీ చేసిన లుకౌట్ నోటీసులు అమల్లో ఉన్నాయని.. తనను అమెరికా వెళ్లకుండా అడ్డుకుంటారని ఆయన ఆందోళన చెందారు. సాధారణంగా లుకౌట్ నోటీసులు ఉంటే… దేశం నుంచి బయటకు వెళ్లేందుకు అంగీకరించరు. అదుపులోకి తీసుకుని సంబధిత దర్యాప్తు సంస్థలకు అప్పగించడమో.. వెనక్కి పంపడమో చేస్తారు. అలా చేస్తే పరువు పోతుందని సుజనా ముందుగానే కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు.
పార్లమెంట్ ఎన్నికల తర్వాత వరకూ సుజనా చౌదరి టీడీపీలో ఉన్నారు. అప్పట్లో ఆయనపై పలు రకాల బ్యాంక్ ఫ్రాడ్ కేసులు ఉన్నాయి. చెన్నై, బెంగళూరుల్లో ఐటీ, ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు ఆయనను ప్రశ్నించాయి. ఎన్నికల తర్వాత టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో ఆయన బీజేపీలో చేరారు.ఆ తర్వాత ఆయా దర్యాప్తు సంస్థల నుంచి నోటీసులు రావడం కానీ.. విచారణకు పిలిచినట్లుగా కానీ ఎక్కడా సమాచారం బయటకు రాలేదు. కానీ లుకౌట్ నోటీసులు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి.