కత్తి మహేష్ ఇప్పుడో గతించిన అధ్యాయం. అతని మరణమే కాదు..జీవితం కూడా రకరకాల ప్రశ్నల మయం. ప్రశ్నించడమే పనిగా పెట్టుకున్న మహేష్.. ఆ గుణం వల్లే తన జీవిత కాలంలో చాలామందికి దూరమయ్యాడు. ప్రశ్నించే తత్వమే చాలామందికి దగ్గర కూడా చేసింది. ఎప్పుడూ ఓదో ఓ ట్వీట్ తో, కామెంట్ తో వార్తల్లో ఉండడం పనిగా పెట్టుకున్నాడు. బహుశా తన తత్వమే అంతేమో..? విమర్శలకు, వివాదాలకూ కేరాఫ్ గా నిలిచాడు. సినీ విశ్లేషకుడిగా ఉన్నప్పుడు తన గురించి ఎవ్వరికీ తెలీదు. నటుడిగా చేసిన గొప్ప పాత్రలేం లేవు. దర్శకుడిగా ఓ సినిమా తీశాడు. అదీ ఫ్లాపే. అయితే… ఎప్పుడైతే సామాజిక, రాజకీయ కోణాల్ని ఎత్తుకున్నాడో, వాటిపై ప్రశ్నలు సంధించడం మొదలెట్టాడో, హిందూత్వంపై ఎప్పుడైతే గళం విప్పాడో.. అప్పటి నుంచీ.. తను చాలా పాపులర్ అయిపోయాడు. ముఖ్యంగా పవన్ ని టార్గెట్ చేసుకుని చేసిన వ్యాఖ్యలు, వేసిన ట్వీట్లూ… తనని ఎప్పుడూ టచ్లో ఉండేలా చేశాయి. వాటి వల్ల ఏం సాధించాడు? ఎంతమంది అక్కసు మూటగట్టుకున్నాడు? అనేది పక్కన పెడితే – ఓ కంచు కంఠం మాత్రం డీటీఎస్ టోన్ లో వినిపించేది.
పవన్ అభిమానులకు తను ఆగర్భ శత్రువు అయిపోయాడు. హిందుత్వంపై చేసిన కామెంట్ల వల్ల ఓ వర్గం మనోభావాలు దారుణంగా దెబ్బతిన్నాయి. అవే.. టీవీ ఛానళ్ల డిబేట్లలో.. తరచూ కనిపించే వక్తని చేసేశాయి. సోషల్ మీడియాలో కత్తి మహేష్ కి ఫాలోవర్లు బాగా పెరిగారు. ఓ పార్టీ.. తనని అనధికార ప్రచార కర్తగా పెంచి పోషించిందన్నదీ నిజమే. కత్తి మహేష్ మాటల్లో, రాతల్లో ఎంత నిజాయతీ. ఎంత నిస్పక్షపాతం, ఎంత ఉపయోగం ఉందన్నది పక్కన పెడితే.. తాను నమ్ముకున్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా, నిక్కచ్చిగా చెప్పే గుణం అయితే స్పష్టంగా కనిపించింది. ఎంతమంది తనపై మాటల తో దాడి చేస్తున్నా – నిబ్బరంగా నిలబడ్డాడు. ఒక్కడై పోరాడాడు. విమర్శల్ని తనదైన స్టైల్ లోనే తిప్పి కొట్టాడు.
పవన్ – కత్తి మహేష్ మధ్య ఎపిసోడ్ – కత్తి జీవితాన్ని చాలా క్లిష్టమైన స్థితిలో పడేసింది. పవన్ అభిమానులు ఓరకంగా కత్తిపై కత్తులు దూశారు. వాళ్లపై తానొక్కడే యుద్ధం చేశాడు. అయితే.. సినీ విమర్శకుడిగా తమ మధ్య వైరాన్ని సైతం కత్తి మహేష్ పక్కన పెట్టాడు. `వకీల్ సాబ్` సినిమాకి తానిచ్చిన పాజిటీవ్ రివ్యూనే అందుకు నిదర్శనం. ఆ విషయంలో మాత్రం పవన్ అభిమానుల మనసుల్ని మహేష్ గెలుచుకున్నట్టే లెక్క. కత్తి మహేష్ మాటల్లో, రాతల్లో నెగిటీవ్ వైబ్రేషన్స్ బుసలు కొడుతున్నట్టు కనిపించినా.. స్వతహాగా.. నెమ్మదస్తుడని, తనతో చాలా చనువుగా ఉండేవాళ్లు చెప్పే మాట. సినిమా సర్కిల్స్ లో కత్తి మహేష్ కి మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉంది. చాలా సినిమాలు పట్టాలెక్కడానికి ఇతోదికంగా సాయం చేశాడు. చాలా సినిమాల స్క్రిప్టు లో తన చేయి ఉంది. `పలాస` సినిమా పట్టాలెక్కడానికి కత్తి మహేష్ ఓ కారణం. ఇలా ఎన్నో సినిమాలు.
కత్తి మహేష్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆదుకున్న చేతులెన్నో. సినిమా సెలబ్రెటీలు… `ఖర్చు మొత్తం మేం భరిస్తాం` అని ముందుకొచ్చినా – కత్తి స్నేహ గణం మాత్రం దానికి నిరాకరించింది. కత్తి మహేష్ ని ఆరోగ్యవంతుడ్ని చేయడం మా బాధ్యత అని చెప్పాయి. కత్తి మహేష్ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచీ.. ఇప్పటి వరకూ.. ఆ స్నేహ గణమే కంటికి రెప్పలా కాపాడుకుంది. ఇదంతా.. కత్తి సంపాదించుకున్న ఆస్తే.
కత్తి మహేష్ మరణం చాలామందిని కలత పెడుతోంది. ఓ వర్గం మాత్రం `మాదేవుడ్నే అంటాడా.. ఇదే తగిన శాస్తి..` అంటూ తన అక్కసు ఇప్పటికీ వెళ్లక్కుతోంది. వ్యక్తికీ వ్యక్తికీ మధ్య, వ్యక్తికీ వ్యవస్థకీ మధ్య, వ్యవస్థకీ వ్యక్తికి మధ్య అభిప్రాయ బేధాలే ఉంటాయి తప్ప.. కోపాలు, పంతాలూ, శాపనార్థాలూ కాదు. ఎవరైనా సరే.. ఈ విషయాన్ని గుర్తించుకుంటే మంచిది. ప్రశ్నించే అధికారం ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అయితే ఆ ప్రశ్న సహేతుకమా? కాదా? ఆ ప్రశ్నతో ఉపయోగం ఉందా, లేదా? ఎవరి మనోభావాలు దెబ్బ తింటున్నాయి? అనే విషయాల్ని ఆలోచించుకోవాలంతే. కత్తి మహేష్ అది చేయలేదు. ఆ తప్పు.. ఇప్పుడు మిగిలినవాళ్లు చేయకూడదంతే.