బీహార్ రాష్ట్ర ప్రస్తావన తీసుకు రాకుండా గతంలో బీహార్‌లో ఏం జరిగిందో ఇప్పుడు ఏపీలో కూడా అదే జరగబోతోందని ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ.. తన వారాంతపు ఆర్టికల్ “కొత్తపలుకు”లో విశ్లేషించారు. జగన్మోహన్ రెడ్డి ఇవాళ కాకపోతే రేపైనా జైలుకెళ్లాలనే వాస్తవాన్ని గ్రహించారని అందుకే ఆయన తన తదుపరి ఎవరు అన్నదానిపై దృష్టి పెట్టి కార్యాచరణ రంగం చేసుకుంటున్నారని కూడా చెప్పుకొచ్చారు. అసలు కుటుంబంలో గొడవలు అక్కడే వచ్చాయని ఆయన విశ్లేషణ. జగన్మోహన్ రెడ్డి తాను జైలుకెళ్లిన తర్వాత తన భార్య భారతిని సీఎం చేయాలని డిసైడయ్యారట. కానీ కుటుంబంలోని వారు.. ముఖ్యంగా చెల్లి షర్మిల మాత్రం… తల్లి విజయలక్ష్మిని సీఎం చేయాలని కోరారట. దానికి విజయలక్ష్మి కూడా అంగీకరించారట. కానీ జగన్ మాత్రం.. ససేమిరా అనడంతో …కుటుంబం మొత్తం జగన్మోహన్ రెడ్డికి దూరం అయిందని.. తెలంగాణలో పార్టీ పెట్టుకున్న షర్మిలతోనే కుటుంబం ఉందని ఆర్కే చెబుతున్నారు. దానికి సాక్ష్యంగా.. ఇడుపులపాయలో వైఎస్ సమాధికి నివాళులు అర్పించేందుకు జగన్ వెళ్లినప్పుడు.. ఆయన వెంట ఒక్క అవినాష్ రెడ్డి ఫ్యామిలీ మాత్రమే ఉందని.. చూపించారు.
గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ సీఎంగా ఉండగా సీబీఐ కేసుల్లో లాలూ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు ఆయన వారసులు చాలా చిన్న పిల్లలు. అందుకే ఆయన తన భార్య రబ్రీదేవిని ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. రబ్రీదేవికి చదువు లేదు. నిరక్ష్యరాస్యురాలు. అయినా .. పదవి కుటుంబం దాటి పోకూడదని అలా చేశారు. ఆమె పదవీ కాలంలో బీహార్ భ్రష్టుపట్టిపోయింది. ఆ దెబ్బకు ఆర్జేడీ చాలా కాలం కోలుకోలేదు. ఇటీవల మళ్లీ ఓ కొడుకు అంది రావడంతో కోలుకుంటోంది. ఇప్పుడు.. ఏపీలోనూ రబ్రీదేవి తరహాలోనే జగన్ సీబీఐ కేసుల్లో జైలుకెళ్తే… విజయలక్ష్మిని సీఎంను చేస్తారని… ఆర్కే విశ్లేషిస్తూ బీహార్‌ను గుర్తు చేసేలా చెప్పారు.
ఈ మొత్తం వ్యవహారంలో బీజేపీ పాత్ర ఏమిటన్నది కూడా ఆర్కే చర్చించేశారు. తమిళనాడు తరహాలో జయలలిత చనిపోయిన తరవాత అన్నాడీఎంకే వర్గాలు పొట్లాడుకున్న తర్వాత బీజేపీకి .. వారిని కలిపి ఇద్దర్నీ గుప్పిట్లో పెట్టుకుంది. అలాగే.. ఏపీలోనూ చేస్తుందని ఆర్కే జోస్యం చెప్పేశారు. ఈ అంశంపై ఇప్పటికే బీజేపీ పెద్దల్లో చర్చ జరిగిందని .. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుందామన్న ఆలోచనలో వారున్నట్లుగా ఆర్కే విశ్లేషించారు. అసలు ఆర్కే ఆర్టికల్‌లో ఓ విశేషం ఏమిటంటే… ఆమె ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టకపోయినా… తెలంగాణలో రాజకీయం చేసుకుంటున్నా.. ఏపీ నుంచి కొంత మంది వైసీపీ ఎమ్మెల్యేలు వెళ్లి చర్చలు జరుపుతున్నారట.
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా కార్నర్ చేసేలా ఆర్టికల్స్‌లో మసాలా అద్దడం… ఆర్కేకు తెలిసినంతగా ఎవరికి తెలియదని అనుకోవచ్చు. ఈ వారం ఆర్టికల్ నిండా అలాంటి మసాలనే దట్టించారు. రాజకీయాలపై ఆసక్తి ఉన్న వారికి ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. కానీ.. అన్నీ చెప్పిన ఆర్కే.. చివరిలో మరో మాట చెప్పారు.. అదేమిటంటే.. జగన్మోహన్ రెడ్డి అధికారానికి ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బందేమీ లేదని తేల్చేశారు. అంటే… మరి తదుపరి ఏం జరుగుతుందన్నది ఊహాగానాలే కదా.. ఆర్కే ఈ వారం ఆర్టికల్ కూడా అంతే..!