సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ నెల 12న అభిమానులతో భేటి కానున్నారు. అనూహ్యంగా రజనీ ఏర్పాటు చేసిన ఈ భేటీ కి కారణాలు ఏంటి అన్నది ప్రస్తుతానికి తెలియడం లేదు. అయితే భేటీ అనంతరం మళ్లీ రాజకీయాలపై వ్యాఖ్యలు చేస్తాడా అన్న చర్చ జరుగుతోంది. వివరాల్లోకి వెళితే..
కొన్ని దశాబ్దాల పాటు ఊరించి ఉరించి, చివరకు జయలలిత మరణానంతరం రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తానని అధికారిక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన నాటి నుండి రజినీకాంత్ బిజెపి పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు అన్న విమర్శలు రావడం, బీజేపీతో పొత్తు పెట్టుకున్నా, లేక బిజెపికి ఓటు వేయమని చెప్పినా తాము వినము అని రజనీకాంత్ అభిమానులు ఆయనకే వార్నింగ్ ఇవ్వడం కూడా తెలిసిందే. అనంతర పరిణామాల్లో రజినీకాంత్ తాను రాజకీయాల్లోకి రావడం లేదని, ఆరోగ్యం సహకరించడం లేదని వ్యాఖ్యలు చేశారు. దీనికితోడు రజినీకాంత్ చేయించుకున్న అంతర్గత సర్వేలలో పార్టీకి, తనకు కూడా ఘోర పరాజయం తప్పదని తేలిన కారణంగానే రజినీకాంత్ రాజకీయాల నుంచి నిష్క్రమించాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఎన్నికలు అయిపోయాయి, తాజాగా అమెరికా వెళ్లి వచ్చిన తర్వాత ఆరోగ్యం కూడా కుదుటపడింది. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ అభిమాన సంఘాల నేతలతో భేటీ కావడం ఆసక్తి కలిగిస్తోంది.
గతంలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసే ముందు రజనీకాంత్ ఇదేవిధంగా అభిమాన సంఘాల నాయకులని కలిసే వారు. ఇప్పుడు రజనీకాంత్ మళ్లీ అదే విధంగా అభిమానులతో మీటింగ్ ఏర్పాటు చేయడం చర్చకు దారితీస్తోంది. రజినీకాంత్ త్వరలోనే సినిమాల నుండి రిటైర్ కావచ్చు అన్న వార్తలు ఒక వైపు, మళ్లీ రాజకీయపరమైన వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందన్న వార్తలు మరొకవైపు వస్తున్న నేపథ్యంలో రజనీకాంత్ అభిమాన సంఘాల తో భేటీ ఆసక్తి కలిగిస్తోంది.
మరి ఆ భేటీ అనంతరం రజనీకాంత్ ఏం చెప్తారా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.