కర్నూలు జిల్లా సంగమేశ్వరం వద్ద నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతలపై తెలంగాణ మాత్రమే కాదు.. ఏపీలోనూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు ముగ్గురు ఈ అంశంపై ముఖ్యమంత్రి జగన్కు లేఖ రాశారు. శ్రీశైలం ప్రాజెక్ట్ నిండకుండానే… నీటిని మొత్తంగా రాయలసీమకు తరలించడం వల్ల.. ప్రకాశం జిల్లాకు నీరు అందే మార్గం పూర్తిగా అడుగంటి పోతుందని..ఆవేదన వ్యక్తం చేశారు. అటు తెలంగాణ నిర్మిస్తున్న ప్రాజెక్టులతో పాటు.. ఇటు ఏపీ సర్కార్ కూడా.. ఎత్తిపోతల వల్ల ప్రకాశం జిల్లాకు నీరు అందకుండా పోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాకు అత్యధికంగా నాగార్జున సాగర్ ద్వారా అందే నీళ్లే ప్రధానమైన వనరు. వర్షాభావం కూడా ఎక్కువే. గత పన్నెండుళ్లలోరెండు, మూడు సార్లు మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. దీంతో శ్రీశైలం నీటిని 800 అడుగుల నుంచి తరలిస్తే.. తమ జిల్లా అన్యాయమైపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి రాయలసీమ ఎత్తిపోతల పథకం ప్రభుత్వం ప్రకటించినప్పటినుండి దానిపై ప్రకాశం జిల్లాలో చర్చ జరుగుతోంది. శ్రీశైలం నుంచి నీరు తోడేస్తే సాగర్ ఆయుకట్టుకు నీరందే పరిస్థితి దాదాపుగా ఉండదని వారు ఆందోళన చెందుతూ వస్తున్నారు. అయితే అత్యధికులు అధికార పార్టీ నేతలే కావడంతో ఎవరూ నోరు మెదపలేదు. చివరికి మంత్రులు కూడా తమ రైతాంగం మదిలో ఉన్న అనుమానాలను నివృతి చేయలేదు. ప్రకాశం జిల్లాలో ఈ ప్రాజెక్టుపై వ్యతిరేకత వస్తుందని ముందుగానే అంచనా వేసి.. ఆ జిల్లాకు చెందిన మంత్రి సురేష్తో.. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ప్రకటనుచేయిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మిస్తామని ఆయన తరచూ ప్రకటిస్తున్నారు. సబ్జెక్ట్ ఆయన శాఖది కాకపోయినప్పటికీ.. ప్రకటనలు చేయడం వెనుక వ్యూహం ఉందని భావిస్తున్నారు. అదిప్పుడు నిజమయ్యే అవకాశం కనిపిస్తోంది.
వైసీపీ నేతలు నోరు మెదపకపోవడం.. జిల్లాకు చెందిన మంత్రి సురేష్ కూడా.. సీమ ఎత్తిపోతలను సమర్థించడంతో చివరికి టీడీపీ ఎమ్మెల్యేలే తెగించారు. ప్రకాశం జిల్లా ప్రయోజనాలను కాపాడాలని నేరుగా జగన్కు లేఖ రాశారు. దీంతో ఈ ఆంశం మరింత రాజకీయంగా క్రియాశీలకంగా మారే అవకాశం ఉంది. ఏపీ తెలంగాణ మధ్యనే కాకుండా.. డెల్టా.. సీమ ప్రాంతాల మధ్య సెంటిమెంట్ రగిల్చే అస్త్రంగా మారే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. మొత్తానికి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు కీలకమైన విషయాన్నే లేవనెత్తారు. ప్రభుత్వ స్పందనే ఇప్పుడు కీలకం.