ఆంధ్రప్రదేశ్ ప్రజలు బీజేపీకి.. ఆ పార్టీ నాయకులకు ఓ మాదిరిగా కూడా కనిపిస్తున్నట్లుగా లేరు. కళ్ల ముందు కనిపిస్తున్న దాన్ని కూడా అదంతా అబద్దం నమ్మద్దు.. అలాంటిదేమీ జరగదని చెప్పడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. విశాఖ ఉక్కు పరిశ్రమను వంద శాతం అమ్మడానికి ప్రక్రియను ట్రాక్ ఎక్కించిన కేంద్రం… మరో నాలుగైదు నెలల్లోనే పని పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇదంతా బహిరంగరహస్యం.. అయితే బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం.. అబ్బే అసలు స్టీల్ ఫ్యాక్టరీ అమ్మే ఉద్దేశం కానీ.. అమ్మాలన్న ఆలోచన కానీ కేంద్రానికి లేదని .. ప్రైవేటు పరం అయ్యే చాన్స్ లేదని చెప్పుకొస్తున్నారు.
ఆందోళలన్నీ పని లేక చేస్తున్నట్లుగా ఆయన చెప్పుకొస్తున్నారు. సోము వీర్రాజు మాటలు.. స్టీల్ ప్లాంట్ కార్మికులతో పాటు సామాన్యులను కూడా విస్మయం కలిగిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడతామని మొదట్లో ప్రగల్భాలు పలికి.. ఢిల్లీకి వెళ్లి.. నాలుగైదు రోజులు గడిపి.. వచ్చారు కానీ.. ఎలాంటి సానుకూల నిర్ణయం తీసుకురాలేకపోయారు.పైగా వచ్చిన తర్వాత ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. నిజాలు చెప్పకుండా… జరుగుతున్ననిజాన్ని కూడా తొక్కి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుతం ఏం జరిగినా.. జరగలేదని చెబితే.. నమ్మేసే స్థాయిలో ప్రజల రాజకీయ పార్టీలపై భక్తి.. మూఢత్వం పెంచుకున్నారని.. పార్టీని నమ్మని వాళ్లు ఏం చెప్పినా.. చేసినా నమ్మరన్న అభిప్రాయానికి వచ్చేసినట్లుగా ఉన్నారు. ఇలా అడ్డగోలుగా వాదిస్తూ… ప్రజల్ని మోసం చేయడానికి ఏ మాత్రం సంకోచించడం లేదు. వీర్రాజు తీరుపై ఇతర పార్టీల నేతలు మండిపడుతున్నారు. కానీ మొదటి నుంచి బీజేపీ నేతల తీరు అంతేనని.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు.. ప్రతి చిన్న విషయాన్ని ఆరోపణలు చేసి హడావుడి చేసిన బీజేపీ నేతలు.. ఇప్పుడు ఎక్కడా కనిపించకపోవడమే దానికి సాక్ష్యమని అంటున్నారు.