తెలంగాణలో అద్భుతమైన పారిశ్రామిక విధానం ఉందని.. అక్కడి ప్రభుత్వం కూడా ఫ్రెండ్లీగా ఉందని.. కేరళ రాష్ట్రంలో ఆ రాష్ట్ర మీడియాతో కిటెక్స్ అనే కంపెనీ అధినేత ప్రశంసలు గుప్పించారు. తాము అక్కడే పెట్టుబడులు పెట్టబోతున్నామని కూడా ప్రకటించారు. నిజానికి ఈ కిటెక్స్ కేరళలో పెట్టుబడులు పెట్టాలనుకుంది. కానీ అక్కడి రాజకీయ పార్టీలు ఆరోపణలు చేయడంతో మనస్థాపం చెందింది. దీంతో అసలు పెట్టుబడుల ప్రతిపాదన ఉపసంహరించుకోవాలనుకున్నారు కానీ… ఆ అవకాశాన్ని తెలంగాణ అందిపుచ్చుకుంది. విషయం తెలిసిన కేటీఆర్ వేగంగా స్పందించడంతో ఆ పరిశ్రమ తెలంగాణకు చేరింది.
కిటెక్స్ పరిశ్రమ ప్రధానంగా టెక్స్టైల్స్ రంగంలో ఉంది. వరంగల్‌లో టెక్స్టైల్ పార్క్‌ను అభివృద్ధి చేయాలనుకుంటున్న తెలంగాణ సర్కార్… ఈ పరిశ్రమ వస్తే…మంచి ఊపు వస్తుందని డిసైడయ్యారు. తమ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఉంటుందని చెప్పి.. కేటీఆర్ ఆ పరిశ్రమ ప్రతినిధుల్ని మొదటగా పర్యటనకు ఒప్పించారు. వారి కోసం ప్రత్యేక విమానం పంపించారు. దీంతోవారు వచ్చేందుకు అంగీకరించారు. మూడు రోజుల క్రితం.. కిటెక్స్ బృందం తెలంగాణకు వచ్చింది. అక్కడ వారికి కేటీఆర్‌నే స్వయంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తర్వాత వారిని ప్రత్యేక హెలికాఫ్టర్‌లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు తీసుకెళ్లారు.
పర్యటన ముగిసినతర్వాత కంపెనీ ప్రతినిధుల్ని నేరుగా ప్రగతి భవన్‌కే తీసుకెళ్లారు. విందు ఇచ్చారు. చివరికి ఎలా అయినా.. పరిశ్రమ పెట్టేందుకు అంగీకరింపచేశారు. వెయ్యి కోట్ల పెట్టుబడితో.. దాదాపుగా నాలుగువేల ఉద్యోగాలు కల్పించనున్నారు. గతంలో ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు… రెండు ప్రభుత్వాలూ ఇలా హోరాహోరీగా పరిశ్రమల కోసం తలపడేవి. హీరో పరిశ్రమ మొదట తెలంగాణకే వెళ్లింది. చంద్రబాబు ఏపీకి తీసుకెళ్లారు. కానీ ఇప్పుడు.. అలాంటి పోటీ తత్వం.. ఏపీ నుంచి లేకపోవడంతో తెలంగాణ మంత్రికేటీఆర్ పని మరింత సులువయింది. పారిశ్రామికీకరణను.. వరంగల్ కు చేరుస్తున్నారు.