వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఓబుళాపురం మైనింగ్ గనుల రచ్చ జరిగిది. ఇప్పుడు వైఎస్ జగన్ అధికారంలో ఉన్నప్పుడు లేటరైట్ గనుల రచ్చ ప్రారంభమయింది. తూర్పుగోదావరి,విశాఖ జిల్లాల్లో విస్తరించిన మన్యం అడవుల్లో విస్తారంగా లేటరైట్ , బాక్సైట్ ఉంది. బాక్సైట్ తవ్వకాలకు గతంలో వైఎస్ హయాంలో జరిగిన ప్రయత్నాలు వివాదాస్పదమయ్యాయి. రస్ ఆల్ ఖైమా సంస్థకు అనుమతులు ఇచ్చి ఆ సంస్థ నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా జగన్ సంస్థల్లోకి వచ్చేలా చేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత రాజకీయ పరిస్థితుల్లో బాక్సైట్ అనుమతుల్ని రద్దు చేశారు. అయితే జగన్ సీఎం అయిన తర్వాత మన్యంలో మైనింగ్ ప్రారంభమయింది. అక్కడ లేటరైట్ మైనింగ్ జరుగుతోందని ప్రభుత్వం వాదిస్తోంది.
2018లో కోర్టు ఇచ్చిన ఓ రూలింగ్ ఆధారంగా.. జగన్ సీఎం అయిన తర్వాత లేటరైట్ లీజ్‌ను ఇచ్చినట్లుగా ప్రభుత్వం చెబుతోంది. కోర్టు తీర్పును ధిక్కరించలేమని అందుకే.. మైనింగ్‌కు అనుమతి ఇచ్చామని చెబుతోంది. కానీ..కోర్టు తీర్పును వక్రీకరించారని… లీజు ఇచ్చే ముందు గ్రామ పంచాయతీ తీర్మానం లాంటివి తీసుకోవాల్సి ఉన్నా… తీసుకోకుండా..నేరుగా అనుమతిచ్చేశారని టీడీపీ నేతలు అంటున్నారు. ప్రభుత్వం ఐదు వేల టన్నుల లేటరైట్‌కు మాత్రమే తవ్వకాలకు అనుమతి ఇచ్చినట్లుగా చెబుతోంది. కానీ మన్యంలో పరిస్థితి వేరుగా ఉంది.
లేటరైట్‌ను భారీ మొత్తంలో డంప్ చేసేందుకు భారీ స్టాక్ యార్డ్ ను నిర్మించారు. అక్కడ్నుంచి తీసుకెళ్లడానికి రహదారిని కూడా నిర్మించారు. ఇదంతా గూడుపుఠాణి అని క్లారిటీ రావడంతో విపక్షాలు పోరాటం ప్రారంభించాయి. ఆ రోడ్డును.. లేటరైట్ స్టాక్ యార్డును.. అలాగే… మైనింగ్ చేస్తున్న తీరును పరిశీలించి వచ్చాయి. అక్కడ ఓబుళాపురం తరహాలో మైనింగ్ జరుగుతోందని వందల లారీలు.. లేటరైట్ తరలిస్తున్నాయని ఆరోపిస్తున్నాయి. నిజానికి లేటరైట్, బాక్సైట్ ఒకే రకంగా ఉంటాయి. నిపుణులు మాత్రమే నిర్దారించగలరు. ఇప్పుడు.. మన్యం నుంచి తరలిస్తున్న ఖనిజం లేటరైట్ ముసుగులో బాక్సైట్ అని ఆరోపిస్తున్నారు.
ఈ వివాదంపై ప్రభుత్వ వాదన అనుమానాలకు తావిచ్చేదిలా ఉండటంతో విపక్షాలు మరితంగా ఆరోపణలు చేస్తున్నాయి. గత ఇమేజ్ దృష్ట్యా ప్రభుత్వం ఏదో చేయకూడనిపని చేస్తున్నదన్న అనుమానం.. సామాన్యుల్లో ప్రారంభమవుతోంది. అక్కడ లేటరైట్.. అదీ కూడా ఐదు వేల టన్నులు మాత్రమే మైనింగ్ కు అనుమతి ఇస్తే.. అంతకు మించి జరుగుతున్న మైనింగ్‌పై తక్షణం చర్యలు తీసుకోవాల్సి ఉంది. లేకపోతే.. ప్రభుత్వంపై మచ్చ పడటం ఖాయమని అనుకోవచ్చు.