‘ఏజెంట్’ షూటింగ్ నిన్నటి నుంచి ప్రారంభమైంది. అక్కినేని అఖిల్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్లో రూపుదిద్దుకుంటున్న చిత్రమిది. ఇందులో మమ్ముట్టి ఓ కీలకమైన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ పాత్రని నాగార్జున చాలా ఇష్టపడ్డారని తెలుస్తోంది. సురేందర్ రెడ్డి ఈ కథని నాగార్జునకు వినిపించినప్పుడు `ఈ పాత్ర నేను చేస్తే ఎలా ఉంటుంది` అని సురేందర్ రెడ్డిని అడిగారని, కానీ సూరి మాత్రం సున్నితంగా తిరస్కరించాడని టాక్.
నాగ్ ఈ పాత్ర చేస్తే… `ఏజెంట్`పై అంచనాలు భారీగా పెరిగిపోతాయి. ఇది అఖిల్ సినిమాగా కాకుండా, నాగ్ సినిమాగా బయటకు వస్తుంది. ఆ ప్రభావం అఖిల్ కెరీర్‌పై పడుతుందని, సినిమా హిట్టయినా దాన్ని నాగ్ సినిమానే జనం భావిస్తారని… సూరి నచ్చజెప్పాడట. అప్పటికే సురేందర్ రెడ్డి మైండ్ లో మమ్ముట్టి ఉండడంతో.. నాగ్ కూడా `సరే` అన్నాడట. ఈ పాత్ర గురించి నాగ్ నే స్వయంగా మమ్ముట్టికి ఫోన్ చేసి చెప్పాడని, నాగ్ నుంచి ఫోన్ రావడంతో మమ్ముట్టి కూడా కాదనలేకపోయాడన్నది ఇన్సైడ్ వర్గాల టాక్. అదే గనుక.. నాగ్ చెప్పిన వెంటనే సూరి ఓకే అంటే.. ఇది మరో అక్కినేని మల్టీస్టారర్ అయిపోదును.