ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అధికార వర్గాల్లో చీఫ్ సెక్రటరీ కంటే ఎక్కువ అధికారం చెలాయిస్తారని పేరున్న సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ ను హఠాత్తుగా సీఎంవో నుంచి తప్పించారు. ఆయనను జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించారు. ఆయన బాధ్యతలను రేవు ముత్యాలరాజు అనే మరో సీనియర్ ఐఏఎస్‌కు అప్పగించారు. ప్రవీణ్ ప్రకాష్ ను హఠాత్తుగా సీఎంవో నుంచి తొలగించడం రాజకీయవర్గాలకు ఆశ్చర్యం కలిగించినా.. అధికారవర్గాల్లో మాత్రం.. ఇప్పటికే ఆలస్యం అయిందన్న ప్రచారం జరుగుతోంది.
కొన్నాళ్ల పాటు సీఎం జగన్ చెప్పక ముందే ఆయన మనసుకు తగ్గట్లుగా పనులు చేసి పెట్టిన ఆయన.. అనేక వివాదాల్లోనూ ఇరుక్కున్నారు. అయితే ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా.. ఆ ఫలితం..ఇతర అధికారులపైనే పడుతుంది. ఆయనకేమీ ఇబ్బంది ఉండదు. అంతగా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఫ్రీ హ్యాండ్ తీసుకున్న ప్రవీణ్ ప్రకాష్.. కొంత కాలంగా అమరావతిలో కనిపించడం మానేశారు. సీఎం ముఖ్యకార్యదర్శిగా ఆయన బాధ్యతలను పట్టించుకోవడం లేదు. ఆయన కేంద్ర సర్వీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అందుకే చాలా కాలంగా ఆయన ఢిల్లీలోనే ఉంటున్నారు. కానీ ఆయన ట్రాక్ రికార్డు ప్రకారం.. కేంద్ర సర్వీసుల్లోకి తీసుకోవడానికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
దాంతో ఢిల్లీలోనే ఉండి తన ప్రయత్నాలు.. తాను చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఏపీలో పని చేయడానికి ఆయనకు ఇష్టం లేకపోవడంతో బాధ్యతల నుంచి తప్పించినట్లుగా తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కూడా ఆయన ఢిల్లీలోనే ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉండేవారు. ఆయనపై టీటీడీ నిధుల దుర్వినియోగం కేసులో విచారణ కూడా చేయించారు. అయితే అనూహ్యంగా సీఎం జగన్ నేరుగా ఆయనను సీఎంవోలోకి తీసుకోవడంతో దశ తిరిగింది. ఎంత వేగంగా వచ్చారో.. చేయాల్సినదంతా చేసి.. అంతే వేగంగా వెనక్కి వెళ్తున్నారు.