తిరిగి చెల్లించేవాడికే వడ్డీ రేటుపై ఆందోళన ఉంటుంది. చెల్లించే ఉద్దేశం లేని వాళ్లే.. ఎంతైనా పర్వాలేదు.. ముందు అప్పివ్వండి అంటూ వెంటపడుతూ ఉంటారు. ఏపీ ప్రభుత్వ ఇమేజ్ కూడా ఆర్థిక సంస్థల దగ్గర అంతే ఉంది. ప్రతీ మంగళవారం ఆర్బీఐ దగ్గర బాండ్లు వేలం వేసి అప్పులు తెచ్చుకుంటున్న ఏపీ ప్రభుత్వం ఈ వారం కూడా అదే చేసింది. ఏడు శాతానికిపైగా వడ్డీరేటుతో 1750 కోట్లు అప్పు తెచ్చుకుంది. ఏడు శాతానికిపైగా వడ్డీ రేటు అంటే మామూలు విషయం కాదు. ఇది సామాన్య ప్రజలు తీసుకునే గృహరుణం వడ్డీరేటుతో సమావేశం. కాలవ్యవధి కూడా అంతే భారీగా పదిహేనేళ్ల వరకూ నిర్ధారించారు.
గత కొద్ది వారాలుగా ప్రభుత్వం ఇదే పని చేస్తోంది. వడ్డీ ఎంత అని ఆలోచించకుండా అప్పులు చేసుకుంటూ పోతోంది. ప్రభుత్వం తీరు.. అప్పు ఇస్తే చాలన్నట్లుగా ఉండటంతో.. చాలా వరకూ ఆర్థిక సంస్థలు ప్రభుత్వానికి అప్పులివ్వడానికి వెనుకాడుతున్నాయి. స్వయంగా గ్యారంటీ ఇస్తామన్న ఎవరూ ముందుకు రావడం లేదు. ఇప్పుడు ఆర్బీఐ కూడా.. వెనక్కి తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ వారం తీసుకున్న అప్పుతో.. వచ్చే డిసెంబర్ వరకూ తీసుకోవాల్సిన రుణ పరిమితి దాదాపుగా అయిపోయిందని అంటున్నారు. అందుకే.. మరింత అప్పులు తీసుకునేందుకు అవకాశం కల్పించాలంటూ ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. మినహాయించిన అప్పుల మొత్తం మళ్లీ తమకు కేటాయించాలని.. ఆ మేరకు అప్పులు చేసుకుంటామని చెబుతోంది.
కేంద్రం అంగీకరిస్తుందో లేదో కానీ.. అప్పులు తీసుకునేందుకు అంగీకరించకపోతే.. ఏపీ సర్కార్ కష్టాల్లో పడటం ఖాయం. జీతాలు.. పెన్షన్లు పంపిణీ చేయడానికి కూడా వెదుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎడాపెడా చేసిన అప్పుల వల్ల.. నెలవారీగా చెల్లించాల్సిన వాయిదాల మొత్తం కూడా పెరుగుతోంది. దీన్ని ఆర్బీఐ ముందుగానే మినహాయించుకుంటుంది కాబట్టి… జీతాల కన్నా ముందుగా వాటికే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. ఏపీ సర్కార్కు ఇది మరింతగా ఇబ్బంది పెట్టే అంశం అవుతోంది.