జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ తీవ్ర గందరగోళానికి గురవుతోంది. కోర్టునూ అదే స్థితికి తీసుకెళ్తోంది. మరోసారి విచారణ ప్రారంభమైన తర్వాత సీబీఐ తన స్టాండ్‌ను మార్చుకుంది. లిఖితపూర్వక వాదనలు సమర్పించేందుకు 10 రోజుల గడువు కోరింది. అయితే సీబీఐ కావాలనే ఇలా చేస్తోందని.. లిఖితపూర్వక వాదనలు వెంటనే కోర్టుకు సమర్పించేలా ఆదేశాలివ్వాలని రఘురామ తరపు న్యాయవాది కోరారు. అయితే కోర్టు సీబీఐకి గడువు ఇచ్చింది. తదుపరి విచారణ ఈనెల 26కు వాయిదా పడింది. ఇప్పటికి సీబీఐ అనేక సార్లు తన స్టాండ్‌ను మార్చుకుంది.
మొదట పిటిషన్ దాఖలయినప్పుడు… మూడు సార్లు వాయిదాలు కోరి… చివరికి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన తర్వాత మెరిట్ ప్రకారమే నిర్ణయం తీసుకోవాలని కౌంటర్ దాఖలు చేసింది. తమకు ప్రత్యేకమైన అభిప్రాయం లేదని తెలిపింది. తర్వాత వాదన ల సమయంలోనూ అదే స్టాండ్ మీద ఉంది. అయితే.. ఇక వాదనలు పూర్తయ్యాయి అనుకునే సమయంలో.. లిఖిత పూర్వక వాదనలు సమర్పిస్తామని కోర్టుకు తెలిపి వాయిదా అడిగింది. మళ్లీ వాయిదాకు.. తమకు లఖిత పూర్వకవాదనలు సమర్పించే ఉద్దేశం లేదని తెలిపింది. అప్పుడు కేసు వాయిదా పడింది. మళ్లీ ఈ వాయిదాలో.. లిఖిత పూర్వక వాదనలు సమర్పిస్తామని పది రోజుల గడువును సీబీఐ కోరింది.
సీబీఐ ఇలా ఎందుకు వ్యవహరిస్తుందో కానీ.. రాజకీయ పరమైన ఒత్తిళ్లు ఉన్నాయన్న ఆరోపణలు మాత్రం వస్తున్నాయి. బెయిల్ షరతులు ఉల్లంఘించారో లేదో.. సీబీఐ కోర్టుకు అభిప్రాయం తెలిపితే.. పిటిషన్‌పై నిర్ణయం సులువవుతుంది. అది తెలిసి కూడా సీబీఐ.. సైలెంట్‌గా ఉండటం కాదు.. కోర్టుతోనే గేమ్ ఆడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. వచ్చే విచారణలో సీబీఐ లిఖిత పూర్వక వాదనలు సమర్పిస్తుందా.. లేదా ఇంకేమైనా కారణం చెబుతుందా అన్నదానిపై సీబీఐ ఉద్దేశం ఏమిటో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.