కరోనా మొదటి వేవ్ సమయంలో లాక్ డౌన్ కారణంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఎలు కోత విధించింది సెంట్రల్ గవర్నమెంట్. కేంద్రం డీఎలు కత్తిరిస్తే.. రాష్ట్ర ప్రభుత్వాలు ఏకంగా జీతాలు సగం మేర రెండు, మూడు నెలల పాటు కత్తిరించాయి. ఆ తర్వాతతెలంగాణ సర్కార్ ఆ జీతాలను నాలుగైదు వాయిదాల్లో సర్దుబాటు చేసింది. ఏపీ ఇంకా ఆ పని కూడా చేసినట్లుగా లేదు. ఇప్పుడు సెకండ్ వేవ్ లాక్ డౌన్ల ప్రక్రియ దాదాపుగా పూర్తయిన సమయంలో… కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం.. స్వీట్ న్యూస్ చెప్పింది. డీఏను ఏకంగా పదకొండు శాతం పెంచింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోయిన మొత్తం తిరిగి పొందే అవకాశం ఉంది.
అయితే ఇప్పుడు.. బాధ అంతా రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులదే. కరోనా కారణం చెప్పి డీఎలు.. పీఆర్సీలను పెండింగ్‌లో పెట్టారు. తెలంగాణ సర్కార్ ఒకింత మేలు. పీఆర్సీ ప్రకటించి.. అమలు చేయడానికి సిద్ధమయింది. డీఏలు కూడా మంజూరు చేశారు. కానీ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఒక్కటంటే.. ఒక్క డీఏ కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వలేదు. మొత్తంగా ఏడు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఒక్కో ఉద్యోగి లక్షకుపైగా నష్టపోయారని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో పీఆర్సీ గురించి ఏపీ సర్కార్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. అసలు ఇచ్చే ఉద్దేశంలో కూడా లేదు.
ఉన్న జీతాలే సరిగ్గా ఇవ్వలేకపోతూండటంతో ఉద్యోగ సంఘాలకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతోంది. ఓ వైపు పొరుగు రాష్ట్రంలో ఉద్యోగులు..మరో వైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు.. సుఖంగా ఉంటే.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం ఎక్కడా లేనంత నిస్సత్తువ వచ్చి పడుతోంది. ఇలాంటి పరిస్థితుల వల్ల ఎక్కువ మంది పౌర సేవలకు వచ్చే ప్రజల వద్ద నుంచి లంచాల రూపంలో పిండుకోవడానికి ఆసక్తి చూపిస్తారని అంటున్నారు. ప్రభుత్వ ఆర్థిక బాధలు చూస్తూంటే ఇప్పుడల్లా ఏపీ సర్కార్ ఉద్యోగులకు రిలీఫ్ వచ్చే అవకాశం లేదని అనుకుంటున్నారు.