సెక్షన్ 66-ఏ ఐటీ చట్టం కింద పెట్టిన కేసులను ఎత్తివేయాలని కేంద్ర హోంశాఖ రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆ చట్టాన్ని కొట్టి వేసినా ఇంకా.. ఆ సెక్షన్ కింద కేసులు పెడుతూండటంపై ఇటీవలే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేంద్రానికి నోటీసులు ఇచ్చింది. దీంతో కేంద్ర హోంశాఖ స్పందించింది. సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టులు పెట్టిన వారిని ఐటీ చట్టం 66 ఏ కింద అరెస్ట్ చేయడం దేశవ్యాప్తంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని మరీ దుర్వినియోగం చేస్తున్నారు. ఈ చట్టాన్ని ఆరేళ్ల క్రితమే సుప్రీంకోర్టు కొట్టి వేసింది.
అసలు చట్టమే లేకపోయినా కేసులు పెడుతున్న విషయాన్ని… పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వెయ్యికిపైగా కేసులు ఇలా పెట్టారని ఆధారాలు సమర్పించింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆరేళ్ల క్రితమే తాము కొట్టేసిన ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏ కింద పోలీసులు ఇప్పటికీ కేసులు నమోదు చేయడంపై సుప్రీంకోర్టు దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. తాము స్పష్టంగా తీర్పుఇచ్చినా ఇప్పటికీ కేసులు పెట్టడం ఆశ్చర్యంగానూ, భయానకంగానూ, దిగ్ర్భాంతికరంగానూ ఉందని వ్యాఖ్యానించింది.
చట్టం రద్దయినా కేసులు పెడుతున్నారంటూ.. అనేక ఫిర్యాదులు రావడంతో సుప్రీంకోర్టు 2019లో పోలీసులను చైతన్య పరచాలని ప్రత్యేకంగా రాష్ట్రాలను ఆదేశించింది. అయినా పరిస్థితుల్లో మార్పు రాలేదు. దీనిపై సుప్రీంకోర్టు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న కేంద్రం… ఆ కేసులను ఎత్తివేయడమే పరిష్కారమని భావించినట్లుగా తెలుస్ోతంది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు.. కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలిచ్చారు. ఇప్పుడు ఈ కేసుల బారిన పడిన అనేక మందికి విముక్తి లభిస్తుంది. అయితే.. లేని చట్టంపై కేసులు పెట్టి వేధించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు ఇక ముందు వచ్చే అవకాశం ఉంది.