ప్రభుత్వ భూములను అమ్మడం ద్వారా రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చుకోవడం అనేక రాష్ట్రాలలో ఎప్పటి నుండో జరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 2004లో రాజశేఖరరెడ్డి ప్రభుత్వం వచ్చాక ఈ ధోరణి కాస్త ఎక్కువగా కనిపించింది. అప్పట్లో ఉన్న రియల్ ఎస్టేట్ బూమ్ కూడా ప్రభుత్వానికి కలిసొచ్చింది. అయితే ఇలా ప్రభుత్వ భూములను అమ్మడం అన్నది భవిష్యత్ తరాలకు ప్రభుత్వం చేసే అన్యాయమే అంటూ అనేకమంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతూ ఉంటారు. ఆశ్చర్యకరంగా వారు అధికారంలోకి రాగానే వారు కూడా ఇదే విధంగా భూముల అమ్మకానికి పాల్పడుతుంటారు. రాజశేఖరరెడ్డి హయాంలో ప్రభుత్వ భూములను అమ్మడాన్ని అప్పట్లో టిఆర్ఎస్ పార్టీ కూడా విమర్శించింది. అయితే ఇప్పుడు అదే టిఆర్ఎస్ పార్టీ తెలంగాణలో భూముల అమ్మకానికి పాల్పడుతూ ఉంటే దీనిపై ఫైరయ్యారు బీజేపీ నేత విజయశాంతి.
సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ విజయశాంతి, “తెలంగాణ లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ భూముల అమ్మకానికి తెగబడిన రాష్ట్ర ప్రభుత్వం మీద నేను వేసిన పిటిషన్ పై పాలకులను హైకోర్టు మందలించింది. ఆక్రమణకు గురైతున్న భూములు అమ్ముతున్నామన్న ప్రభుత్వ వాదనపై న్యాయమూర్తులు విస్మయం వ్యక్తం చేశారు. ఆక్రమణకు గురైతే అమ్ముతారా? అని న్యాయస్థానం ప్రశ్నించింది. జిల్లాల్లో భూముల వేలానికి అనుమతి ఇవ్వలేదు. హైకోర్టు 2015లో ఇచ్చిన ఆదేశాలతోనే గురువారం, 15 జులై న కోకాపేట, ఖనామెట్ వేలానికి మాత్రమే అనుమతినిచ్చింది. ప్రతి జిల్లాలో వెయ్యి ఎకరాల చొప్పున 33 వేల ఎకరాలు లాండ్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం వాదనపై… మొత్తం వాదనలు విన్న తరువాతే తీర్పు ఇస్తామని కోర్టు స్పష్టం చేసింది. అసలు ధనిక రాష్ట్రమని చెప్పుకుంటూ ఇలా భూములు అమ్ముకోవలసిన అవసరమేంటో…దాని వెనుకనున్న మతలబేంటో తెలంగాణలో చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడు. పాలక వర్గం, అధికార పార్టీ నేతలు కొనసాగిస్తున్న భూ ఆక్రమణలు, కబ్జాల వ్యవహారాలు పూటకో కథగా జనంలోకి వెళుతూనే ఉన్నాయి. వారు ఆక్రమించుకున్న ఆ భూముల సాక్షిగా ఈ పాలకులు భూస్థాపితం కావడం ఖాయం.” అనే రాసుకొచ్చారు.
అయితే విజయశాంతి వాదన ఎంత సబబుగా ఉన్నప్పటికీ, రేపు ఎప్పుడైనా ఒకవేళ బీజేపీ అధికారంలోకి వచ్చినా ఇదే విధంగా ప్రభుత్వ భూముల అమ్మకానికి పాల్పడుతుంది అనడంలో సందేహం లేదు. ఏదేమైనా కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాల లో ప్రజలకు మింగుడు పడని కొన్ని నిర్ణయాలలో తెలంగాణ ప్రభుత్వ భూములను ప్రైవేటు పరం చేయడం కూడా ఒకటి. దీని ప్రభావం ఎలా ఉంటుంది అన్నది వచ్చే ఎన్నికల్లో నే తెలుస్తుంది.