`మా` ఎన్నికల వ్యవహారం, మా బిల్డింగ్ విషయాలపై.. నందమూరి బాలకృష్ణ తనదైన శైలిలో స్పందించారు. సెటైర్లు వేశారు. `మా` ఎన్నికలన్నది చాలా చిన్న విషయమని, దాని గురించి అమెరికా ప్రెసిడెంటు ఎన్నికల స్థాయిలో చర్చించుకోవడం ఏమిటని ప్రశ్నించారు. `మా` బిల్డింగ్ పై కూడా ఆయన మాట్లాడారు. “అందరూ కలిసి వస్తే…. ఇంద్రభవనం కట్టొచ్చు. అది పెద్ద సమస్యే కాదు“ అన్నారు. అంతే కాదు.. ప్రస్తుత పరిస్థితిపై సెటైర్లు వేశారు. తెలంగాణ ప్రభుత్వంతో చిత్రసీమ రాసుకుపూసుకుని తిరుగుతోందని, అడిగితే.. ఒక ఎకరం భూమి ఇవ్వరా? అని ప్రశ్నించారు బాలయ్య.
ఇది వరకు `మా` సభ్యులు ఫండ్ రైజింగ్ కోసం అమెరికాలో కొన్ని కార్యక్రమాలు నిర్వహించారు. అప్పటి వ్యవహారంపై బాలయ్య మాట్లాడారు. అప్పుడు బిజినెస్ క్లాసు టికెట్లేసుకుని తిరిగారని, ఆ ఫండ్ డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నించారు. `మా` ఎన్నికల కోసం అలా ప్రెస్ మీట్లు పెట్టి వాదులాడుకోవడం ఏమిటని? వాళ్ల భాష కూడా సరైన రీతిలో లేదని వ్యాఖ్యానించారు. ఓ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య ఇలా స్పందించడం.. ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. `మా`లో లోపాయికారి వ్యవహరాలు చాలా జరిగాయా? ఫండ్ పేరుతో నిధుల్ని సేకరించి అలా వచ్చిన డబ్బుల్ని మాయం చేశారా? అనే కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. కాకపోతే.. `మా` భవనం కోసం విష్ణుతో పాటు తాను ఓ చేయి వేస్తానని, మిగిలిన వాళ్లూ అలా ముందుకు రావాలని ఆయన కోరడం ఆహ్వానించదగిన పరిణామం.