వెబ్ సిరీస్‌లలో ఉన్న మజా… తెలుగు ప్రేక్షకులకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. ఫ్యామిలీ మాన్ నుంచి… పాతాళ్ లోక్ వరకూ అన్ని వెబ్ సిరీస్‌లనూ ఫాలో అవుతున్నారు. ఆహా నుంచి నెట్ ఫ్లిక్స్ వరకూ అప్ డేట్ లోనే ఉంటున్నారు. తెలుగులో కథకులు ఇప్పుడు వెబ్ సిరీస్‌లపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. కొత్త కథలు పుడుతున్నాయి. అయితే తెలుగులో `ఆహా` అనిపించేంత స్టఫ్ ఎక్కడా కనిపించలేదనే చెప్పాలి. వెబ్ సిరీస్ చూడడం వరకూ ఓకే. కానీ.. తీయడం మనవాళ్లు ఇంకా నేర్చుకోలేదు. ఆ వెబ్ సిరీస్ ఫార్ములాని సరిగా అర్థం చేసుకోలేదనిపిస్తోంది. ఆహాలో ఇప్పటి వరకూ చాలా వెబ్ సిరీస్‌లు వచ్చాయి. అవి…. ఏమాత్రం మెప్పించలేదు. ఇప్పుడు ఆహాలో వచ్చిన మరో వెబ్ సిరీస్ `కుడి ఎడమైతే`. అమలాపాల్ ప్రధాన పాత్రధారి కావడం, `యూటర్న్`లాంటి సూపర్ హిట్ తీసిన పవన్ కుమార్ దర్శకుడు కావడంతో… ఈ వెబ్ సిరీస్ పై సహజంగానే ఆసక్తి పెరిగింది. మరింతకీ… `కుడి ఎడమైతే` ఎలా ఉంది? తెలుగులో వస్తున్న వెబ్ సిరీస్‌లపై ఉన్న `సో..సో` ముద్రని తొలగించిందా? తెలుగులోనూ సరుకున్న సిరీస్‌లు వస్తాయన్న నమ్మకం కలిగించిందా?
కథలోకి వెళ్దాం… అభి (రాహుల్ విజయ్) ఓ డెలివరీ బోయ్. తనని కష్టకాలంలో ఆదుకునే ఫారుక్ భాయ్ అంటే తనకు చాలా ఇష్టం. ఓరోజు ఫారుక్ రోడ్డు ప్రమాదంలో గాయపడతాడు. ఆ రోజు రాత్రి.. డెలివరీ ఇస్తూ.. ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం కళ్లారా చూస్తాడు. అదే రోజు రాత్రి సరిగ్గా 12 గంటలకు అభి బండిని ఓ పోలీస్ వెహికిల్ గుద్దేస్తుంది. ఆ పోలీస్ ఆఫీసర్ తో పాటు అభి కూడా చనిపోతాడు. తీరా చూస్తే.. ఇదంతా అభి కన్న కల.
మరోవైపు దుర్గా (అమలాపాల్) కథ నడుస్తుంది. తను ఓ పోలీస్ ఆఫీసర్. అప్పటికీ సిటీలో వరుస కిడ్నాపులు జరుగుతుంటాయి. కానీ కేస్ సాల్వ్ అవ్వదు. దుర్గాపై ఒత్తిడి తీవ్రంగా ఉంటుంది. వరుణ్ అనే ఐదేళ్ల పిల్లాడ్ని కూడా కిడ్నాప్ చేస్తారు. ఇప్పుడు కూడా ఎలాంటి క్లూస్ దొరకవు. ఆ కేసు విషయమై.. హడావుడిలో జీప్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఓ డెలివరీ బోయ్ కి డాష్ ఇస్తుంది దుర్గా. ఆ ప్రమాదంలో దుర్గ చనిపోతుంది. ఇదంతా దుర్గ కల. దుర్గ డాష్ ఇచ్చిన డెలివరీ బోయ్… అభి అయితే, అభి కలలో తనని యాక్సిడెంట్ కి గురి చేసిన పోలీస్… దుర్గ. అలా ఒకరి కలని, మరొకరు కీలకమైన మలుపు తిప్పుతారు.
అయితే విచిత్రంగా అటు అభికీ, ఇటు… దుర్గకి కలలో జరిగిన విషయాలే నిజ జీవితంలోనూ జరుగుతుంటాయి. అభి.. తన స్నేహితుడైన ఫారుక్ ని రక్షించడానికి, దుర్గ వరుణ్ ని పట్టుకోవడానికి ఈ కలలో వచ్చిన విషయాలే క్లూస్ గా వాడుకుంటారు. మరి వారి ప్రయత్నాలు సఫలీకృతం అయ్యాయా? లేవా? అసలు ఒకరి కలలోకి మరొకరు ఎందుకొచ్చారు? అనేది తెరపై చూడాలి.
టైమ్ లూప్ అనే కాన్సెప్టు బేస్ చేసుకుని తీసిన వెబ్ సిరీస్ ఇది. ఇలాంటి కాన్సెప్టులు మనకు చాలా కొత్త. కలలో జరిగిన విషయాలు నిజ జీవితంలోనూ జరిగినట్టు ఉండడం, ఒకే రోజు తమ జీవితంలో రిపీట్ అవ్వడమే.. ఈ టైమ్ లూప్ . చెబితే అర్థం తేలిగ్గా అర్థం కాదు. చూడాల్సిందే. చెప్పడానికే గజిబిజిగా ఉండే కాన్సెప్టుని పట్టుకుని వెబ్ సిరీస్‌గా తీయాలన్న ప్రయత్నం.. మెచ్చుకోదగినది. ఈ సిరిస్‌లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ఒక్కొక్కటీ 30 నిమిషాలకు పైమాటే. అంటే దాదాపుగా 4 గంటలు. కానీ ఒక్క నిమిషం కూడా.. విసుగు అనిపించదు. ప్రతీ ఎపిసోడ్ కొత్త ట్విస్టులతో.. ఊపిరి సలపనివ్వకుండా చేస్తుంది. తొలి ఎపిసోడ్ లో, తొలి సన్నివేశం నుంచే .. దర్శకుడు కథలోకి వెళ్లిపోయాడు. ముందు అభి కథ చెబుతూ.. దుర్గ కథలోకి వెళ్లాడు. ఒకే సన్నివేశాన్ని రెండు కోణాల్లోంచి రివీల్ చేయడం, ప్రతీసారీ జరిగిందే జరగడం, అలా జరుగుతున్నప్పుడు ప్రతీసారీ కథని మలుపు తిప్పడం, ఓ కొత్త ట్విస్టు రివీల్ చేయడం.. ఇవన్నీ `కుడి ఎడమైతే`కి ప్రాణాలు.
నిజంగా ఇలాంటి కథ చెప్పడం రిస్క్. చెప్పడంలో ఏమాత్రం తడబడినా దర్శకుడు కన్ఫ్యూజ్ అయిపోయి. ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్లోకి పాడేస్తాడు. ఆ ప్రమాదం ఈ వెబ్ సిరీస్ లో చాలా ఎక్కువ. కానీ.. దర్శకుడు స్క్రిప్టుని పక్కాగా, పకడ్బందీగా రాసుకున్నాడు. తాను ఎక్కడా కన్ఫ్యూజ్ అవ్వలేదు. ప్రేక్షకుల్నీ చేయలేదు. చూసిన సీనే.. రిపీట్ గా చూస్తున్నా ప్రేక్షకుడికి విసుగురాదు. పైగా `ఈసారి కథలో ఎలాంటి మలుపు వస్తుందో` అనే కొత్త ఆసక్తి మొదలవుతుంది. అక్కడక్కడ మాత్రం ఇది దుర్గ కల? లేదంటే… అభి కలా? అనేది అర్థం కాదు. పైగా ఉప కథలు ఎక్కువ. పార్వతి ఎపిసోడ్, వరుణ్ కిడ్నాప్, ఫారుక్ యాక్సిడెంట్ ఇవన్నీ ఉప కథల కిందే లెక్క. కానీ.. అసలు కథలోనూ వీళ్ల పాత్రలు, ఆ ఎపిసోడ్లూ కీలకమయ్యాయి.
తెలుగులో వెబ్ సిరీస్‌లు కథల ఎంపికలోనే విఫలం అవుతున్నాయి. సినిమాకి అనుకున్న కథని కాస్త అటూ ఇటూ లాగి వెబ్ సిరీస్ చేస్తున్నారు. అక్కడే ఫలితాలు తేడా కొడుతున్నాయి. ఇది పక్కాగా… వెబ్ సిరీస్ కి సరిపడా కథ. కథని ఇంత డిటైల్డ్ గా చెప్పకపోతే – చాలా లూప్ హోల్స్ కనిపిస్తాయి. వెబ్ సిరీస్ కాబట్టి, దర్శకుడికి డిటైల్ గా చెప్పడానికి కావల్సినంత టైమ్ దొరికింది. దాన్ని సరిగా వాడుకున్నాడు కూడా. దుర్గకి ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంది. దాంతో పాటు.. ఈ యాక్సిడెంట్ ని కళ్లారా చూసిన.. ఒకే ఒక్క సాక్షి (బిచ్చగాడు) కి సంబంధించిన ఉప కథ ఉంది. ఆ రెండింటినీ దర్శకుడు కావాలనే దాచాడు. సెకండ్ సీజన్ కోసం. క్లైమాక్స్ లో ఓ చిన్న ట్విస్ట్ వదిలేసి.. సెకండ్ సీజన్ కోసం దారి వేసుకున్నాడు దర్శకుడు. సో.. `కుడి ఎడమైతే 2` కోసం ఎదురు చూడొచ్చు.
అమలాపాల్ ని ఈ తరహా పాత్రలో చూడడం కొత్తగా అనిపిస్తుంది. దుర్గగా నూటికి నూరు పాళ్లు న్యాయం చేసింది. ఇక అభిగా అల్లుకుపోయాడు రాహుల్ విజయ్. తన నటనలో ఎక్కడా అసహజత్వం కనిపించలేదు. నటించినట్టు ఎక్కడా అనిపించలేదు. పాత్రలో బిహేవ్ చేశాడంతే. తనలో సందీప్ కిషన్ పోలికలు ఎక్కువగా కనిపించాయి. మిగిలినవాళ్లంతా.. ఎవరి పాత్రలకు వాళ్లు న్యాయం చేశారు. టెక్నికల్ గా వెబ్ సిరీస్ చాలా బాగుంది. క్వాలిటీ కనిపించింది. రైటింగ్ సైడ్ అదరగొట్టేశారు. ఎంతో పక్కాగా, శ్రద్ధగా రాసుకుంటే తప్ప.. ఇలాంటి వెబ్ సిరీస్ చేయలేరు. మొత్తానికి తెలుగులోనూ మంచి వెబ్ సిరీస్‌లు వస్తాయని చెప్పడానికి, చెప్పుకోవడానికి సాక్ష్యంగా నిలిచింది.. కుడి ఎడమైతే. కచ్చితంగా మిస్ కాకుండా చూడాల్సిన వెబ్ సిరీస్‌ల జాబితాలో.. దీన్ని చేర్చేయొచ్చు.