ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగికి ఓ బదిలీ కావాలంటే.. ఓ పోస్టింగ్ కావాలంటే …మంత్రుల్లో.. మరో పవర్ ఫుల్ వ్యక్తినో పట్టుకుని పని చేసుకోవాలి. కానీ తెలంగాణలో ఓ అధికారికి.. తనకు ఏపీ ప్రభుత్వంలో పని చేయాలని అనిపించింది. అదీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి ఓఎస్డీగా వెళ్లాలనుకున్నారు. అంతే.. తెలంగాణ సర్కార్ కు దరఖాస్తు పెట్టారు. ఇట్టే పనైపోయింది. అసలు తెలంగాణ సర్కార్ కు దరఖాస్తు పెట్టడమేంది..? ఆయన అడిగిన పోస్టులేనే ఏపీ సర్కార్ నియమించడం ఏంది..? అనేది ఎవరి అంచనాలకు తగ్గట్లుగా వారు విశ్లేషించుకోవాల్సిందే. ఈ అద్భుతం జరిగింది మరి..!
సజ్జల రామకృష్ణారెడ్డి షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని.. రాజ్యాంగేతర శక్తిగా ఉంటున్నారని అధికార.. అనధికార వర్గాల్లో విస్తృతమైన ప్రచారం జరుగుతోంది. ఆయనే అన్ని రకాల కార్యకలాపాలు చక్క బెడుతున్నారు. అయితే ఏదీ అధికారికం కాదు. కానీ ఆయన మాట చెబితే.. జగన్ చెప్పినట్లే. అందుకే.. ఆయన సూపర్ పవర్. డిప్యూటీ సీఎంలు అయినా చేతులు కట్టుకుని నిలబడాల్సిందే. ఇప్పుడు ఆయనపై పని భారం పెరిగిపోయింది. అత్యంత నమ్మకంగా తన కోసం పని చేసే ఓ అధికారి కోసం ఆయన చాలా ప్రయత్నాలు చేశారు. ఐఏఎస్‌లను నమ్మలేకపోయారు.
ఇతర రిటైర్డ్ అధికారులూ ఆయనను మెప్పించలేకపోయారు. కానీ తెలంగాణలో జైళ్ల శాఖలో ఉన్న దశరథరామిరెడ్డి అనే అధికారి మాత్రం.. ఆయనకు అత్యంత నమ్మకస్తుడిగా కనిపించారు. వెంటనే… ఆయన తెలంగాణ సర్కార్‌కు తాను ఏపీకి వెళతానని దరఖాస్తు పెట్టుకున్నారు. అదీ కూడా.. సజ్జల దగ్గరకే ఓఎస్డీగా వెళతానని ధరఖాస్తు పెట్టుకున్నారు. తెలంగాణ అంగీకరించింది. ఆయన నేరుగా వచ్చి సజ్జల వద్ద ఓఎస్డీగా చేరనున్నారు. ఆయన అదే పోస్టులోకి వెళ్తానని దరఖాస్తు పెట్టుకోవడం ఏమిటో.. దానికి తెలంగాణ సర్కార్ ఆమోదించడం ఏమిటో… ఆయన అలా ఏపీకి వచ్చేందుకు.. అదీ కూడా సజ్జల ఓఎస్డీగా పోస్టింగ్ డిసైడ్ చేసుకుని దరఖాస్తు చేసుకోవడం ఏమిటో .. అంతా మాయగా ఉందని.. సెక్రటేరియట్లో చర్చోపచర్చలు జరుగుతున్నాయి. కానీ ఇదంతా… సజ్జల పవర్‌కు సజీవ సాక్ష్యం లాంటిదని అంటున్నారు. తెలంగాణ సర్కార్‌తో … రాజకీయంగా గొప్ప స్నేహం ఇప్పటికీ సాగుతోంది.
కేవలం జల వివాదాల విషయంలో.. రాజకీయ ప్రయోజనాల కోసమే.. ఇలా ఒకరినొకరు విమర్శించుకుంటున్నారని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. నిజంగా కేసీఆర్ కన్నెర్ర చేస్తే.. జగన్ ఆస్తులపై దాడులు జరుగుతాయని అంటున్నారు. కానీ ఇక్కడ మాత్రం.. కేసీఆర్ ఏపీ ప్రయోజనాలపై ఎటాక్ చేస్తున్నారు కానీ జగన్ జోలికి పోవడం లేదు. దానికి జగన్ సర్కార్ కూడా పెద్దగా నోరు మెదపడం లేదు.ఫిర్యాదులు చేసి.. సరిపుచ్చుకుంటున్నారు. మొత్తానికి అనధికారిక సీఎం సజ్జల రామకృష్ణారెడ్డికి చేదోడువాదోడుగా తెలంగాణ అధికారి వచ్చేశారు.