వైఎస్ షర్మిల తాను ఎవరిపైనో అలిగి తెలంగాణలో పార్టీ పెట్టలేదని అందరికీ నమ్మకం కలిగించడానికి తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీని సీరియస్‌గా నడుపుతానని చెప్పడానికి తంటాలు పడుతున్నారు. ఒంటరిగా ఉన్నా మధ్యలో కాడి దించి వెళ్లిపోనని గట్టిగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. పార్టీని ప్రకటించిన తర్వాత తొలి సారి మీడియా ప్రతినిధులతో ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అన్నింటికీ ఓపికగా సమాధానాలిచ్చారు. ప్రధానంగా అన్నపై అలిగి పార్టీ పెట్టారని ఎక్కువగా ప్రచారం జరుగుతూండటంతో బ్యాలెన్సింగ్‌గా సమాధానం ఇచ్చారు. తాను ఎవరిపై అలిగి పార్టీ పెట్టలేదని స్పష్టం చేశారు. అలిగితే మాట్లాడటం మానేస్తారు కానీ పార్టీ పెడతారా అని ప్రశ్నించారు.
అంటే ఆమె జగన్‌తో మాట్లాడటం మానేశారని అర్థం చేసుకోవచ్చు. అదే సమయంలో జగన్ ను విమర్శించడం ద్వారా.. ఆ రూమర్స్‌ను మరింతగా పెంచాలని అనుకోలేదు. ఏపీలో రాజన్న రాజ్యం వస్తున్నట్లే ఉందని..కాస్త పాజిటివ్‌గా మాట్లాడారు. ఆ వెంటనే … అలా రాజన్న రాజ్యం రాకపోతే ప్రజలే తిరగబడతారని చెప్పుకొచ్చారు. ఇక తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ను.. కేసీఆర్.. కేటీఆర్‌ను విమర్శించకపోతే.. ఆ పార్టీకి మిత్రపక్ష హోదాను అందరూ కలిసి ఇచ్చేస్తారు కాబట్టి.. కాస్త ఘాటుగానే విమర్శలు గుప్పించేందుకు షర్మిల తాపత్రయ పడ్డారు. కేటీఆర్ పెద్ద మొగోడేగా అని మహిళలకు రాజకీయ ప్రాధాన్యత గురించి ప్రశ్నవచ్చినప్పుడు విమర్శించారు.
పనిలో పనిగా.. తాము తెలంగాణ వ్యతిరేకులం కాదని చెప్పుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. ఓ రకంగా తెలంగాణ ఇవ్వాలని యూపీఏ మేనిఫెస్టోలో పెట్టింది వైఎస్సేనని గుర్తు చేశారు. ఉద్యమంలో పాల్గొనకపోయినంత మాత్రాన వ్యతిరేకులం కాదన్నారు. పార్టీని ఎక్కువ కాలం నడపలేరంటూ వస్తున్న విమర్శలపైనా స్పందించారు. తాను ఉండకపోయినా… తన పార్టీ ఉంటుందని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాజకీయాల్లో మొదటి టాస్క్.. షర్మిల తన సీరియస్ నెస్ని నిరూపించుకోవడం అయింది.