వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పార్టీ కోసం పని చేసిన వారికి నామినేటెడ్ పదవుల పందేరం సాగనుంది. పెద్ద ఎత్తున వడపోతులు చేసి.. దాదాపుగా అన్ని కార్పొరేషన్లు.. ఇతర నామినేటెడ్ పదవులకు ప్రాబబుల్స్ ఎంపిక చేశారు. అక్కడక్కడా అసంతృప్తి చెలరేగే అవకాశం ఉండటంతో బుజ్జగింపుల కోసం ప్రకటన వాయిదా వేశారు.ప్రస్తుతం ఎమ్మెల్యేలు లేకుండా ఉన్న నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఓడిపోయిన వారికి.. ఇంచార్జులుగా ఉన్న వారికి ప్రాధాన్యపోస్టులు ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో వైసీపీలో కోలాహలం కనిపిస్తోంది. ద్వితీయ శ్రేణి నేతలతో పాటు… ఎమ్మెల్యే టిక్కెట్‌కు పోటీ పడే నేతలు కూడా.. తమకు పదవి రాబోతోందని.. ఊహాల్లో తేలియాడుతున్నారు.
నిజానికి నామినేటెడ్ పోస్టుల భర్తీని అధికార పార్టీలు.. ఓ పెద్ద తలనొప్పిగా భావిస్తాయి. వాటిని భర్తీ చేయడం వల్ల.. పార్టీలో అసంతృప్తి పెరిగిపోతుందని భావిస్తూంటాయి. కొంత మందికి పదవులు వస్తాయి.. చాలా మందికి ఇవ్వలేరు. పదవులు వచ్చిన వారు మినహా మిగతా క్యాడర్ అంతా పార్టీకి వ్యతిరేకం అయిపోతుంది. ఇంత కాలం కష్టపడిన గుర్తింపు రాలేదని వారు రచ్చ చేస్తారు. ఈ కారణంగా పదవుల ఆశ చూపుతూ…అధికార పార్టీలు టైంపాస్ చేస్తూనే ఉంటాయి. అదే సమయంలో ఆ పదవులను భర్తీ చేయడం వల్ల… ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆర్థిక భారం పడుతుంది. రిస్క్ ఎందుకని.. ఆ పదవుల భర్తీని ఆశ చూపించడానికే ప్రభుత్వాలు వాడుకుంటూ వస్తున్నాయి. రెండో సారి అధికారంలోకి వచ్చినప్పటికీ.. టీఆర్ఎస్ అధినేత కేసీఆస్.. మెజార్టీ నామినేటెడ్ పోస్టులను ఇంత వరకూ భర్తీ చేయకపోవడానికి ఇదే కారణం.
అయితే సీఎం జగన్ మాత్రం.. ఏ రూపంలో అయినా పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. పదవి చేపట్టిప్పటి నుండి క్యాడర్‌కు ఆయన ఏదో రూపంలో పదవులు పంపిణీ చేస్తున్నారు. తెర వెనుక పని చేసిన వారికి ప్రభుత్వంలో సలహాదారులు.. ఇతర పదవులు ప్రారంభంలోనే ఇచ్చారు. కార్యకర్తలకు వాలంటీర్ పదవులు ఇచ్చారు. ఆ తర్వాత స్థానిక ఎన్నికల్లో స్వీప్ చేయించడం ద్వారా.. మెజార్టీ ద్వితీయ శ్రేణి నేతలకు అన్ని రకాల పదవులు వచ్చేలా చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే చాన్స్ లేని వారికి.. కుల కార్పొరేషన్లు పెట్టి పదవులు అప్పగించారు. ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారు. మొత్తంగా వైసీపీలో ఉన్న వారందరికీ ఏదో ఓ పదవి వచ్చేలా జగన్ చూస్తున్నారు.దీంతో అసంతృప్తి ఉండదనే అంచనాకు వచ్చారు. ఈ కారణంగా వైసీపీ నేతల్లో కూడా.. తమకు ఏదో పదవి దక్కిందని.. ప్రభుత్వం పట్టించుకుందని సంతృప్తి పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.