వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు రానున్న పార్లమెంట్ సమావేశాల్లో గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. ఓ వైపు సభను స్తంభింపచేయాలని పార్టీ హైకమాండ్ ఆదేశిస్తోంది. మరో వైపు అది బీజేపీ పెద్దలకు ఆగ్రహం తెప్పించకుండా.. ఒత్తిడి అని అనిపించేలా మాత్రమే ఆ “స్తంభన” ఉండాలనే సంకేతాలు వెళ్లాయి. దీంతో రఘురామకృష్ణరాజుపై అనర్హతా వేటు కోసం కాకుండా.. ప్రజా సమస్యల కోసం అన్నట్లుగా సభను స్తంభింపచేయాడానికి వైసీపీ పార్లమెంటరీ పార్టీ వ్యూహం ఖరారు చేసుకుంది. కేంద్రపరిధిలో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం కన్నా… మరోకటి పార్లమెంట్‌లో పోరాటానికి లభించదని అంచనా వేస్తున్నారు. అందుకే ఆ మార్గాన్నే ఎంచుకోవాలని దాదాపుగా డిసైడయ్యారు.
పార్లమెంట్‌ను ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్తంభింపచేస్తే.. కేంద్రం ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోయినా.. తమ ఆగ్రహానికి పరోక్ష కారణం అయిన రఘురామకృష్ణరాజుపై అనర్హతా అంశాన్ని మాత్రం.. సాధించాలని భావిస్తున్నారు. కానీ.. టీడీపీ ఈ విషయంలో వైసీపీని మరింత ఇరుకున పెట్టేందుకు రాజీనామాల వ్యూహాన్ని తెరపైకి తెచ్చింది. విశాఖఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడదల్చుకుంటే… అందరం కలిసి రాజీనామాలు చేద్దామని ప్రతిపాదించింది. వైసీపీ సభ్యులు సై అంటే.. తాము తక్షణం రాజీనామా చేస్తామని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. టీడీపీ పొలిట్ బ్యూరోలోనూ ఈ అంశంపై చర్చలు జరిపారు. రఘురామపై కక్షసాధింపు కోసం.. విశాఖ ఉక్కు ప్రైవేటీ కరణ ఉద్యమాన్ని వాడుకోబోతున్నారని అంచనాకు వస్తున్న టీడీపీ.. రాజీనామాలతో రివర్స్ ఎటాక్ చేయాలని నిర్ణయించుకుంది.
విశాఖఉక్కు కోసం వైసీపీ ఎంత పోరాడితే.. అంత మంచిదని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఈ మేరకు వారిపోరాటంపై అనుమానాలు పెంచి.. చివరికి రాజీనామా చేస్తేనే వారి పోరాటంలో చిత్తశుద్ధి ఉందనే అభిప్రాయానికి తేవాలని అనుకుంటున్నారు. దానికితగ్గట్లుగానే రాజీనామాలపై ప్రస్తుతం డిమాండ్లు ప్రారంభించారు. పార్లమెంట్‌లో వైసీపీ అనుసరించే వ్యూహాన్ని బట్టి… రాజీనామాలపై టీడీపీ ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. ప్రత్యేక హోదా విషయంలో అప్పట్లో టీడీపీపై రాజీనామాల ఒత్తిడి చేసిన వైసీపీకి ఇప్పుడు ఆ వ్యూహం టీడీపీ వైరు నుంచి రివర్స్‌లో వస్తోంది. ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.