ఏపీఐఐసీ చైర్మన్‌గా మెట్టు గోవిందరెడ్డికి పదవిని కేటాయించింది వైసీపీ నాయకత్వం. ప్రస్తుతం ఈ పదవిలో ఆర్కేరోజా ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో మంత్రి పదవికి రోజా పేరును పరిగణనలోకి తీసుకోకపోవడంతో ఆమెను హైకమాండ్ బుజ్జగించింది. అప్పటికప్పుడు ఏపీఐఐసీ చైర్మన్ పదవిని ప్రకటించింది. రాష్ట్ర స్థాయి పదవి కావడం.. పారిశ్రామిక పరంగా.. మంచి ప్రాధాన్యత ఉన్న పదవి కావడంతో ఆమె బాధ్యతలు చేపట్టారు. అప్పటికి ఆమె సంతృప్తి పడినా.. రెండున్నరేళ్ల తర్వాత జరగబోయే పూర్తి స్థాయి పునర్‌వ్యవస్థకరణలో మంత్రి పదవి దక్కుతుందని.. ఆశలు పెట్టుకున్నారు.
ఇప్పుడు జగన్ చెప్పిన రెండున్నరేళ్ల సమయం దగ్గర పడటంతో… రోజా పదవిని మెట్టు గోవిందరెడ్డికి కేటాయించారు. రోజాకు మంత్రి పదవి వస్తుందని.. అందుకే ఉన్న పదవిని తీసేశారన్న అంచనాలో ఆమె సానుభూతిపరులు ఉన్నారు. రోజా కూడా అదే నమ్మకంతో ఉన్నారు. రోజాది రెడ్డి సామాజికవర్గం కావడంతో ఆమెకు మైనస్ అవుతోంది. చిత్తూరు జిల్లా వైసీపీలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక నేతగా ఉన్నారు. ఆయనను కాదని రోజాకు మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కానిపని. అయితే ఇటీవలి కాలంలో రాజకీయాలు మారిపోయాయి. పెద్దిరెడ్డికి.., హైకమాండ్‌తో గ్యాప్ పెరిగిందన్న ప్రచారం ఉంది.
కొన్ని కారణాల వల్ల బొత్సతో పాటు పెద్దిరెడ్డిని ప్రభుత్వ వ్యవహారాలకు దూరంగా ఉంచాలన్న ప్లాన్‌ను వైసీపీ హైకమాండ్ అమలు చేస్తోందని చెబుతున్నారు. ఈ ప్రకారం.. ఈ ఇద్దరు సీనియర్ నేతల్ని రాజ్యసభకు పంపబోతున్నారని కూడా అంటున్నారు. అదే జరిగితే.. రోజాకు చిత్తూరు జిల్లా నుంచి మంత్రి పదవి రావడం ఖాయమని చెప్పుకోవచ్చు. అయితే ఈ పరిణామాలపై పెద్దిరెడ్డి ఎలా స్పందిస్తారు. ఆయనను వైసీపీ హైకమాండ్ ఎలా దారిలోకి తెచ్చుకుంటుంది అన్నదానిపై పరిస్థితి ఆధారపడి ఉంటుంది. ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తే.. రోజాకు మరోసారి ఆశాభంగం కలిగినా ఆశ్చర్యపోనవసరం లేదు.