కరోనా సెకండ్ వేవ్.. శాంతించినా, థియేటర్లు తెరచుకోవడానికి ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చినా – బాక్సాఫీసు దగ్గర కళ లేకుండా పోయింది. నిర్మాతలు, పంపిణీదారులు వెనుకంజ వేయడంతో.. థియేటర్లు తెరచుకోలేదు. అయితే ఈనెల 23 నుంచి తెలంగాణలో థియేటర్లు తెరచుకుంటాయని… థియేటర్ యాజమాన్య సంఘం ప్రకటించింది. ఈమేరకు ఈరోజు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ని ఎగ్జిబీటర్ల సంఘం ప్రతినిధులు కలుసుకున్నారు. థియేటర్ నిర్వహణ సమస్యల్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. లాక్ డౌన్ కాలంలో కరెంటు బిల్లులు కట్టుకోవడంలో మినహాయింపు ఇవ్వాలని, పార్కింగ్ చార్జీలను వసూలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని మంత్రిని కోరారు. ఈ విషయాలపై మంత్రి సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. మంత్రి ఇచ్చిన హామీతోనే ఈనెల 23 నుంచి థియేటర్లు తెరవాలని నిర్ణయించుకున్నారు. తెలంగాణలో 100 శాతం ఆక్యుపెన్సీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏపీలో 50 శాతం ఆక్యుపెన్సీకి మాత్రమే అవకాశం ఉంది. ఏపీలోనూ 100 శాతం పర్మిషన్ వస్తే.. అప్పుడు థియేటర్లు తెరవాలనుకున్నారు. కానీ.. ఏపీ నుంచి ఎలాంటి ప్రకటన రాకముందే.. థియేటర్లు తెరుస్తున్నారు. ఏపీలో రాత్రి కర్ఫ్యూ అమలులో ఉంది. అంటే నైట్ షోలకు అవకాశం లేదన్నమాట. మార్నింగ్ షో, మాట్నీలను 50 శాతం ఆక్యుపెన్సీతో నడిపించుకోవాలి. అలాంటప్పుడు… కొత్త సినిమాలు ఎలా వస్తాయన్నది ప్రశ్నార్థకం. ఈనెల చివరి వారంలో `తిమ్మరుసు` విడుదలకు రెడీ అవుతోంది. ఆ సినిమా రిజల్ట్ ని బట్టి.. మిగిలిన సినిమాలు తమ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం వుంది.