ఎన్టీఆర్ – రామ్ చరణ్.. వీరిద్దరినీ ఒకే ఫ్రేమ్‌లో చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. కొమరం భీమ్ – అల్లూరి సీతారామరాజు చెట్టాపట్టాలేసుకుని నడుస్తూ వస్తుంటే – హారతులు పట్టాలని ఎదురుచూస్తున్నారు. వారందరి కల ఈ ఫ్రెండ్ షిప్ డే కి తీరబోతోంది. ఆర్.ఆర్.ఆర్ నుంచి స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఓ గీతం బయటకు రానుంది. కొమరం భీమ్ – అల్లూరి స్నేహానికి అద్దం పట్టే గీతం ఇది. దీన్ని ప్రమోషనల్ గీతంగా వాడుకోవాలన్నది చిత్రబృందం ఆలోచన. ఓ రకంగా ఇది ఈ సినిమా ప్రచార గీతం కూడా. ఇది వరకే ఈ పాటని కీరవాణి రికార్డ్ చేశారు. ఇప్పుడు ఈ గీతాన్ని చరణ్, ఎన్టీఆర్‌లపై తెరకెక్కించబోతున్నారు. ఈ పాటలోనే.. చిత్రబృందం అంతా కనిపించబోతోంది. నిజానికి కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజుల నేపథ్యాలు వేరు. వాళ్ల కథలు వేరు. కాలాలు వేరు. ఇద్దరూ కలుసుకున్నట్టు చరిత్రలో ఎక్కడా లేదు. వేర్వేరు కాలాలకు చెందిన వీరులు.. ఓచోట కలసుకుంటే ఎలా ఉంటుందన్నది రాజమౌళి ఊహ. వారిద్దరి మధ్య స్నేహం, వైరం చూపించాలన్న ఆలోచన నుంచి ఆర్.ఆర్.ఆర్ కథ పుట్టుకొచ్చింది. ఈ స్నేహితుల దినోత్సవాన.. అల్లూరి, కొమరంల స్నేహ గీతిక వినొచ్చు.