తెలుగులో బీటెక్ విద్యను అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు తెలుగులో బీటెక్ కోర్సుల బోధనకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలికి అనుమతి ఇచ్చేశారు. ఒక్క తెలుగే కాకుండా.. మొత్తం పదకొండు ప్రాంతీయ భాషల్లో ఆయా రాష్ట్రాల్లో బీటెక్ కోర్సుల్లో ఆ భాషలోనే చెప్పుకునేలా అవకాశం కల్పించారు. ప్రాంతీయ భాషల్లో విద్యాబోధనను ప్రోత్సహించేందుకు ప్రధాని మోడీ నిబద్ధతతో ఉన్నారని కేంద్రమంత్రి ప్రధాన్ చెప్పుకొచ్చారు. మిగతా రాష్ట్రాల సంగతేమో కానీ.. ఏపీలో మాత్రం… బీటెక్ తెలుగు మీడియం హాట్ టాపిక్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఏపీ ప్రభుత్వ విధానం ఎల్కేజీలోకూడా ఇంగ్లిషే మరి.
ఈట్ ఇంగ్లిష్…డ్రింక్ ఇంగ్లిష్.. స్లీప్ ఇంగ్లిష్ అనేది.. ఏపీ సర్కార్ విధానం. అందు కోసం మాతృభాషను లేకుండా చేయడానికి చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంది. అసలు తెలుగు మీడియం ఎత్తేయాలని నిర్ణయించుకుంది. అంటే.. అసలు తెలుగులో పాఠాలే చెప్పరన్నమాట. ఎల్కేజీ నుంచి అన్ని రకాల తగతుల్లోనూ ఇంగ్లిష్ మీడియమే ఉంటుంది. అలాంటి రాష్ట్రంలో… బీటెక్ క్లాసులు.. తెలుగులో చెప్పేందుకు .. తెలుగులోనే పరీక్షలు రాసేందుకు అనుమతి మంజూరు చేయడం అంటే.. ఆసక్తికరమే మరి. ఇప్పటి వరకూ డిగ్రీ వరకూ తెలుగు మీడియంలో చదువుకునే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఏదైనా ఇంగ్లిష్ మీడియమే.
ఇక వృత్తి, సాంకేతిక విద్యా కోర్సులకు అయితే.. మొత్తం ఇంగ్లిష్ మీడియమే. ఈ పరిస్థితి తెలుగు మీడియంలో చదువుకున్న విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉండేది. చాలా కాలంగా దీనిపై విమర్శలు వస్తున్నాయి. ప్రాంతీయ భాషల్లో ఉన్నతవిద్య అందాలన్న డిమాండ్లు వినిపించాయి. దీనిపై కేంద్రం అనేక కమిటీలతో పరిశీలనలు చేయించి… చివరికి బీటెక్‌ను తెలుగు మీడియంలో చెప్పుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. మిగిలిన రాష్ట్రాల్లో తమ తమ భాషలపై ప్రజలకు మక్కువ.. ప్రభుత్వాలకు ఇంకా ఎక్కువ మక్కువ ఉంటుంది. తమ అస్థిత్వాన్ని కాపాడేది భాషే అని వారు నమ్ముతారు. కానీ ఏపీలో అటు పాలకులు కానీ ఇటుప్రజలు కూడా.. భాష పట్ల అంత సెంటిమెంట్‌తో ఉండరు. అందుకే..కేంద్రం నిర్ణయాన్ని పెద్దగా పట్టించుకునే పరిస్థితి ఉండకపోవచ్చంటున్నారు.