కేంద్ర మంత్రివర్గంలో కర్ణాటక నుంచి ఉడుపి లోక్‌సభ సభ్యురాలు శోభ కరంద్లాజేకు చోటు కల్పించడం కర్ణాటక రాజకీయాల్లో పెను సంచలనానికి కారణం అయింది. ఆమెకు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని ఎవరూ అనుకోలేదు. కానీ ఇచ్చిన తర్వాత మాత్రం.. అది ఆమెకు దక్కిన ప్రయారిటీ కాదని.. కర్ణాటకలో రాజకీయ సమీకరణాలను మార్చేందుకు బీజేపీ హైకమాండ్ వేసిన ముందస్తు ఎత్తుగడ అని అంచనాకు వచ్చారు. ఆ ఎత్తుగడ… యడ్యూరప్పను తొలగించడమేనని అంటున్నారు. యడ్యూరప్పకు శోభ కరంద్లాజే అనుచరురాలు. ఆమెకు పదవి ఇస్తే యడ్యూరప్పకు ప్రాధాన్యం ఇచ్చినట్లే. ఈ రకంగా యడ్యూరప్పను ముందుగానే బుజ్జగించి .. తర్వాత ఆయన పదవికి ఎసరు పెట్టబోతున్నారని చెప్పుకున్నారు.
ఇప్పుడు అదే నిజం అవుతోంది. మంత్రి వర్గ విస్తరణ జరిగి.. రోజులు గడవక ముందే యడ్యూరప్పను ఫలానా తేదీన తొలగించబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఆయన కూడా ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీని.. హోం మంత్రి అమిత్ షాను కలిసి వచ్చారు. పైకి మాత్రం.. తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని చెప్పుకొస్తున్నారు. కానీ హైకమాండ్ ఆలోచనలు వేరుగా ఉన్నాయంటున్నారు. నిజానికి యడ్యూరప్పకు బీజేపీ విధివిధానాల ప్రకారం ఎలాంటి పదవి ఇవ్వకూడదు. ఎందుకంటే.. ఆయనవయసు ఎనభై పైనే. కానీ కర్ణాటకలో కాంగ్రెస్ – జేడీఎస్ సర్కార్ కూల్చివేసిన తర్వాతి పరిణామాల్లో యడ్యూరప్ప మాత్రమే సీఎంగా ఉంటేనే.. కాస్త స్థిరత్వం ఉంటుందని బీజేపీ హైకమాండ్ నమ్మి.. తమ రూల్స్‌ను పక్కన పెట్టి మరీ.. యడ్యూరప్పను సీఎంను చేశారు.
ఇప్పుడు ఆయనపై ఎమ్మెల్యేల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. పాలనలో కూడా చురుకుదనం లేకుండా పోయిందన్న కంప్లైంట్లు హైకమాండ్‌కు చేరుతున్నాయి. ఈ క్రమంలో మళ్లీ ఎన్నికల నాటికి పార్టీ గాడి తప్పకుండా ఉండాలంటే… ఖచ్చితంగా నాయకత్వ మార్పు అవసరం అని అంచనా వేస్తున్నారు. కేంద్రమంత్రివర్గం నుంచి సదానందగౌడను కూడా తప్పించారు. ఆయనకు పార్టీ లేదా ప్రభుత్వం బాధ్యతలు ఇస్తారని చెబుతున్నారు. అయితే… యడ్యూరప్ప స్థాయి నేత కర్ణాటక బీజేపీలో మరొకరు లేరు. యువ నేత .. లోక్‌సభ ఎంపీ తేజస్వి సూర్యను భావినేతగా భావిస్తున్నా.. ముఖ్యమంత్రిగా చేయడం తొందరపాటు అవుతుందన్న విశ్లేషణ ఆ పార్టీలో ఉంది.