వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రెస్మీట్లో కేటీఆర్ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారుతున్నాయి. ఆమెకు తెలంగాణ ప్రజల పట్ల.. ఎంత చిన్నచూపు ఉందో ఆ వ్యాఖ్యలే ఉదాహరణ అన్న దగ్గర్నుంచి ప్రారంభించి.. అసలు కేటీఆర్ ఎవరో చెప్పాల్నా అంటూ… ఆమె వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడం వరకూ అన్నింటినీ సోషల్ మీడియాలో హైలెట్ చేస్తున్నారు టీఆర్ఎస్ సానుభూతిపరులు. పార్టీపెట్టిన తరవాత షర్మిల తొలిసారిగా ప్రెస్‌మీట్ పెట్టారు. ఆ ప్రెస్మీట్లో … అందరికీ జవాబులు చెప్పారు. ఓ సందర్భంలో కేటీఆర్ ప్రస్తావన వచ్చింది. ఆ సమయంలో.. ” కేటీఆర్ .. కేటీఆర్ ఎవరంటూ.. పక్కనున్న వ్యక్తిని అడిగింది. కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అని పక్కనున్న వాళ్లు చెప్పారు.. ఓ కేటీఆరా.. కేసీఆర్ కుమారుడిగా మాత్రమే ఆయన తెలుసు.. ఆయనేమైనా పెద్ద మొగోడా..?” అంటూ వ్యాఖ్యలు చేశారు.
ఆ వ్యవహారం మొత్తం చూసేవాళ్లకి కృతకంగా అనిపించింది. ఆ వ్యాఖ్యలపై ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. గత ఎన్నికలకు ముందు కేటీఆర్ గురించి ఆమె మాట్లాడిన మాటలు.. కేటీఆర్ సాయంతో గత ఎన్నికలకు ముందు ఆమె తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పెట్టిన కేసులు.. ఇలా అన్నింటినీ బయటకు తీసుకు వస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో.. కేటీఆర్‌కు లోకేష్‌కు అసలు పోలికలు ఎక్కడని.. కేటీఆర్ ఎక్కడో ఆకాశంలో ఉంటారని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఓ సినిమా హీరోతో కలిపి గాసిప్స్ ప్రచారం చేస్తూండటంతో.. ఆమె కేటీఆర్‌కే ఫిర్యాదు చేశారు.
వెంటనే కేటీఆర్ ఆ.. పోస్టులు పెడుతున్న వారిని అరెస్ట్ చేయించారు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎన్నికలకు కేటీఆర్ పవర్‌ను షర్మిల కూడా వినియోగించుకున్నారని.. ఇప్పుడు ఎవరు అని.. నాటకాలుఆడుతున్నారని టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలపై షర్మిలపై దారుణంగా విరుచుకుపడుతున్నారు. తెలంగాణ ప్రజల్ని తక్కువగా అంచనా వేసి.. పార్టీ పేరుతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయడమే కాకుండా.. కేటీఆర్ లాంటి వారిని కించ పర్చడం కూడా ప్రారంభించారని అంటున్నారు. షర్మిల పార్టీలో అంతా అనుకున్నట్లుగా జరగడానిక ిచాలా పక్కాగా ఏర్పాట్లు ఉంటాయి. వైఎస్ఆర్ కూడా.. తాను ఎవరి ప్రాధాన్యతనైనా తగ్గించాలనుకుంటే.. వారెవరో గుర్తు లేనట్లుగా పక్కన వారిని అడుగుతూ ఉంటారు. అచ్చంగా షర్మిల కూడా అలాంటి స్కిట్టే..కేటీఆర్‌పై వేయబోయి.. విమర్శలు ఎదుర్కొంటున్నారని.. ఇతర పార్టీల నేతలు విశ్లేషిస్తున్నారు.