దేశంలో ఇప్పుడు సరికొత్త రాజకీయ సంచలనం ప్రారంభమయింది. అదే ట్యాపింగ్. కేంద్ర మంత్రులు,సుప్రీంకోర్టు జడ్జి,,జర్నలిస్టుల ఫోన్ల ట్యాపింగ్చేశారని.. ఇజ్రాయెల్ కు చెందిన పెగాసుస్ స్పైవేర్ సంస్థ ట్యాపింగ్ చేసినట్లు పత్రాలు బయటకు వచ్చాయి. ఇప్పుడీ ట్యాపింగ్ ఎవరు చేయించారన్నది ప్రధానంగా అందరినీ తొలుస్తున్న ప్రశ్న. పెగాసుస్ స్పైవేర్ కేవలం ప్రభుత్వాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. వ్యక్తులకు అందుబాటులో ఉండదు. అందుకే ఈ విషయం బయటకు వచ్చిన వెంటనే కేంద్ర ప్రభుత్వం ఉలిక్కి పడింది. తమకేమీ సంబంధం లేదని చెప్పుకొచ్చింది.
ద వైర్ వెబ్ సైట్ ముందుగా ఈ పెగాసుస్ సాఫ్ట్ వేర్ ద్వారా ఎవరెవరి ఫోన్లపై నిఘా పెట్టారో… వెల్లడించింది. అందులో ప్రస్తుతం ఉన్నఓ సుప్రీంకోర్టు న్యాయమూర్తి పేరు కూడా ఉంది. అయితే అవన్నీ ఇప్పుడు కూడా నిఘాలో ఉన్నాయో లేవో తెలియదు. కానీ గత సాధారణ ఎన్నికలకు ముందు 2018-19లో మాత్రం నిఘా పెట్టారు. అందులో కేంద్రమంత్రుల పేర్లతో పాటు… ప్రతిపక్ష నేతలు… జర్నలిస్టుల పేర్లు ఎక్కువగా ఉండటం.. కలకలం రేపుతోంది. ప్రభుత్వం సొంత వారిపై నిఘా పెట్టిందని ఈ వ్యవహారంతో రుజువు అవుతోందని కొంత మంది అంటున్నారు. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా.. ఎన్నో ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఓ సారి ఓ ముఖ్యమంత్రి ఆడియోనే వెలుగులోకి వచ్చింది. అలాంటి ట్యాపింగ్ వ్యవహారాలు ఎప్పుడూ సాగుతూనే ఉన్నాయి. అయితే.. వాటికి సరైన ఆధారాలు ఉండవు.
ఆడియో వెలుగులోకి రావడమే సాక్ష్యంగా చెప్పుకున్నా.. ఇక్కడ ఉన్న ప్రభుత్వాలు.. వారి చేతుల్లోనే ఉంటాయి కాబట్టి.. విచారణ వరకూ వెళ్లదు. తర్వాత ప్రభుత్వాలు మారినా… వాటికి సంబంధించిన ఆధారాలేమీ లేకుండా చేసుకుంటారు. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ సహా ఎంతో మంది అనేక రకాల ఆరోపణలు చేశారు. తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని.. వ్యక్తిగత రహస్య సమాచారం కూడా సేకరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. కేంద్ర, రాష్ట్రాల్లోని పెద్దలు.. ఈ నిఘాను.. కేవలం ప్రతిపక్ష నేతలపైనే ఉంచడం లేదు.. తమ సొంత వారిపైనా ప్రయోగిస్తున్నారని.. తాజాగా ఆధారాలతో సహా నిరూపితమైంది. ఇదేమీ చిన్న విషయం కాదు. సంచలనాత్మకం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
కొద్ది రోజుల కిందట.. ఏపీలో న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారన్న దుమారం రేగింది. దీనిపై హైకోర్టులో పిటిషన్లు పడ్డాయి. విచారణ కూడాజరుగుతోంది. ప్రస్తుతానికి నోటీసులు జారీ చేశారు. తర్వాత ఆ కేసు విచారణ వెనుకబడిపోయింది. తాజా పరిణమాల నేపధ్యంలో ఈకేసు మళ్లీ తెరపైకి వస్తుందేమో చూడాలి..! మొత్తానికి దేశంలో ప్రభుత్వాలు… ఇతరుల వ్యక్తిగత స్వేచ్చను హరిస్తున్నాయని మాత్రం దీనితో స్పష్టమవుతోంది.